
Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కరోనా మళ్లీ తన దాడిని ప్రారంభించినట్లు కనిపిస్తోంది.యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరుకుంది. కేవలం వారం రోజుల్లోనే కొత్తగా 164 కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా చూస్తే, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొత్త కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
వివరాలు
కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం
హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో,దేశంలోని 257 యాక్టివ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS)ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమీక్షలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC),ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR),డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR),కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు పాల్గొన్నారు. వారు ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తూ,దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోనే ఉందని తేల్చారు. భారత జనాభా పరంగా చూస్తే కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదైన కేసులన్నీ తేలికపాటివే అని,ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని వారు చెప్పారు.
వివరాలు
పర్యవేక్షణ, ముందు జాగ్రత్త చర్యలు
దేశవ్యాప్తంగా COVID-19, ఇతర శ్వాసకోశ సంబంధిత వైరల్ వ్యాధుల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR వంటి సంస్థలు బలమైన నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నాయని అధికారులు వివరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొత్త కేసులు నమోదు అవుతున్నాయని, అక్కడి పరిస్థితులను బట్టి అవసరమైన చర్యలు చేపడుతున్నామని కూడా కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ JN.1 వల్ల బాధపడే వారికి ప్రధానంగా జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆరోగ్య శాఖ వర్గాలు తెలియజేశాయి.