Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 19, 20 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఇటీవల అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కోస్తాంధ్ర ప్రజలకు తాజాగా 'అక్వాన్' రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య ఎక్కడైనా తుపాను తీరం దాటే అవకాశముందని చెబుతున్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. తుపాను ప్రభావంతో ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వివరాలు
నేడు తుపానుగా బలపడనున్న వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అక్కడే కేంద్రీకృతమై ఉంది.
ఆదివారం సాయంత్రానికి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
ఇది సోమవారానికి తుపానుగా బలపడనుంది. ఈ తుపానుకు ఇరాన్ 'అక్వాన్' అనే పేరును సూచించింది.
అక్వాన్ అంటే రాక్షస శక్తి అని అర్థం. ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమాలికి 620 కిలోమీటర్లు,చెన్నైకి 800కిలోమీటర్లు,విశాఖపట్నానికి 960కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారానికి మరింత బలపడుతుందని పేర్కొంది.
దక్షిణ బంగాళాఖాతం,దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది.
మంగళవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడొచ్చని అంచనా వేస్తోంది.
వివరాలు
18 నుంచి తుపాను ప్రభావం.. 130 కి.మీ. వేగంతో గాలులు
రానున్న రెండు రోజుల్లో తుపాను మరింత బలపడి ఉత్తర దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఈ నెల 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం వరకు తీవ్ర తుపానుగా కొనసాగనుంది.
అనంతరం మరింత బలపడి 18వ తేదీ రాత్రికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. 19వ తేదీ ఉదయం వరకు ఇదే తీవ్రత కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ సమయంలో గంటకు 90 నుంచి గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుపాను ప్రభావంతో ఈ నెల 18న కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
వివరాలు
19, 20 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు
కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఈ రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
మరోవైపు ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వెంబడి గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుపాను కదలికలు,తీరం దాటే ప్రాంతంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.