బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు
బిపోర్‌జాయ్ సైక్లోన్ 'అత్యంత తీవ్రమైన తుపాను'గా తీవ్రరూపం దాల్చడంతో గుజరాత్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. గుజరాత్ లోని అరేబియా సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రభుత్వం మంగళవారం కూడా కొసాగించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తుపానుపై ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తుపాను పరిస్థితిపై ఆరా తీశారు.
తీర ప్రాంతంలోని 10కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజల తరలింపు
గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర జిల్లాల్లోని తీర ప్రాంతంలోని 10కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజలను అధికారులు మంగళవారం సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 7,500మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటికే కచ్, సౌరాష్ట్ర జిల్లాల్లో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు జిల్లాలోని తీరాల వెంబడి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. తుపాను తీరం దాటే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అదికారులు చెప్పారు. కచ్, జామ్‌నగర్, మోర్బి, గిర్ సోమనాథ్, పోర్ బందర్, దేవభూమి ద్వారక జిల్లాలు జూన్ 13-15మధ్యకాలంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షపాతంతో పాటు 150కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్
తుపాను తీవ్రత నేపథ్యంలో గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్‌ల తీరాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. అంతర్జాతీయ సముద్ర చట్టానికి అనుగుణంగా, రాబోయే ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి నౌకలను అప్రమత్తం చేయడానికి ఓడరేవులు కూడా హెచ్చరిక సిగ్నల్స్ ను జారీ చేయాల్సి ఉంటుంది. తుపాను శుక్రవారం నైరుతి రాజస్థాన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున నార్త్ వెస్ట్రన్ రైల్వే 67 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. బిపోర్‌జాయ్ తుపాను గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని కచ్, పాకిస్థాన్‌లోని కరాచీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
జుహూ బీచ్‌లో నీట మునిగిన ముగ్గురు, తీరంలో కోస్ట్ గార్డ్ నౌకలు గస్తీ
జాతీయ, రాష్ట్ర విపత్తు దళాలు ఒక్కొక్కటి 12 చొప్పున బృందాలను మోహరించినట్లు, పునరావాస కేంద్రాల్లో ఆహారం, మందులు ఏర్పాట్లు చేసినట్లు గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు. అంతేకాకుండా సహాయ చర్యల కోసం ఆర్మీ, నేవీ సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే, భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు తీరంలో గస్తీ తిరుగుతున్నాయి. ముంబైలోని జుహూ బీచ్‌లో సోమవారం నీటిలో మునిగి ఓ బాలుడు సహా మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని రక్షించారు. ముంబయిలో తుఫాను కారణంగా పలు బీచ్‌ల వద్ద రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.