
Rajnath Singh: రాజ్‌నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు,అజిత్ దోవల్.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంపై పాకిస్థాన్ మరోసారి తీవ్ర దుస్సాహసానికి పాల్పడింది. పాక్ భూభాగం నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. ఈ ఘటనపై కీలక వివరాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు.
పాక్ దాడులపై తాజా పరిణామాలను ప్రధాని మోదీ దగ్గర నుంచి గమనిస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి.
దీనితోపాటు, ప్రధాని మోదీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిపై చర్చించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు.
వివరాలు
సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్
ఇదిలా ఉండగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), త్రివిధ దళాధిపతులు,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.
పాక్ దాడులకు భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
ముఖ్యంగా జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
అన్ని రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను రద్దు చేశారు. ఏ అధికారిగానైనా జిల్లా హద్దులు దాటి వెళ్లరాదని, అందరూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, భద్రతా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు.