
India-Canada relations: తీవ్రవాద శక్తులకు లైసెన్స్ ఇవ్వడం వల్లే భారత్-కెనడా సంబంధాలు క్షీణించాయి: విదేశాంగశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-కెనడా సంబంధాలు తిరోగమన దిశలో ఉన్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ పేర్కొన్నారు.
లోక్‌సభలో రాతపూర్వకంగా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
కెనడాలోని వేర్పాటువాదులు, తీవ్రవాదులే ఈ ప్రతికూల పరిస్థితికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
"కెనడాలో తీవ్రవాదులు, వేర్పాటువాదులకు స్వేచ్ఛ కల్పించడం ద్వైపాక్షిక సంబంధాల పడిపోవడానికి కారణమైంది. భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు కెనడాను కోరింది. భారత నాయకుల హత్యలను గొప్పగా చిత్రీకరించే వ్యక్తులు..దౌత్యవేత్తలను బెదిరించే వారు..,ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసే మూకలు, రెఫరెండంల పేరిట భారత విభజనకు మద్దతు ప్రకటించే వేర్పాటువాదులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది" అని మంత్రి వివరించారు.
వివరాలు
కెనడా జోక్యం ఆందోళనకరం
"భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యం కెనడా తీరుతో పెరిగిపోతోంది. నిరంతరం భారత దేశ వ్యవహారాల్లో కెనడా అనవసరంగా జోక్యం చేసుకుంటోంది. ఇది అక్రమ చొరబాట్లు, వ్యవస్థీకృత నేరాలకు మార్గం సుగమం చేసింది. భారత ప్రభుత్వంపై కెనడా చేసిన విమర్శలను మేము తిరస్కరిస్తున్నాం. పరస్పర గౌరవం, సున్నితమైన అంశాల ఆధారంగా కెనడాతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు భారత్ సిద్ధంగా ఉంది" అని కీర్తి వర్థన్ సింగ్ తెలిపారు.
వివరాలు
ఖలిస్థాన్ అంశంపై పెరుగుతున్న వివాదం
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని కెనడా అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి.
భారత నిఘా సంస్థలు సంబంధం లేదని స్పష్టంగా చెప్పినా, ఎటువంటి ఆధారాలు చూపకుండానే కెనడా ప్రభుత్వం భారతంపై నిందలు మోపింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది.
ఈ వివాదం కారణంగా ఇరు దేశాలు పరస్పర దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి.
తాజాగా, భారత్ కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి యత్నిస్తోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు డిప్యూటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఇరు దేశాల మధ్య మరింత దూరం
ఇందుకోసం భారత్ AI టెక్నాలజీలను వినియోగించవచ్చని పేర్కొన్నారు.
చైనా, వియత్నాం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరింత దూరం పెరిగింది.
అయితే, కెనడాలో జరుగనున్న జీ7 సమావేశానికి భారత్ హాజరవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సమావేశం సైడ్‌లైన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.