కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?
అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారతీయత ఉట్టేపడేలా దీన్ని నిర్మించారు. భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే ఈ కొత్త పార్లమెంట్ భవానానికి ఆర్కిటెక్ట్(శిల్పి) ఎవరో తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. భారత కొత్త పార్లమెంట్ భవాన్ని డిజైన్ చేసింది బిమల్ హస్ముఖ్ పటేల్. ఈయన అహ్మదాబాద్‌లో ఉన్న హెచ్‌సీపీ డిజైన్స్ అధినేత.
ప్రస్తుతం సీఈపీటీ యూనివర్సిటీకి అధిపతిగా కొనసాగుతున్న పటేల్
బిమల్ హస్ముఖ్ పటేల్ ఆగస్టు 31, 1961న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆర్కిటెక్చర్ పట్ల పటేల్‌కు ఉన్న మక్కువను చూసిన అతని తండ్రి హస్ముఖ్ చందూలాల్ పటేల్ 1960లో హెచ్‌సీపీ సంస్థను స్థాపించారు. బిమల్ తన ఆర్కిటెక్చర్ విద్యను సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ)లో చదివారు. అక్కడ అతను 1984లో డిగ్రీని పొందారు. 1988లో ఆర్కిటెక్చర్, సిటీ ప్లానింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1995లో అతను బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి సిటీ, రీజినల్ ప్లానింగ్‌లో పీహెచ్‌డీని పూర్తి చేశారు. ప్రస్తుతం అతను చదవుకున్న సీఈపీటీ యూనివర్సిటీకి అధిపతిగా పని చేస్తున్నారు.
2019లో పటేల్‌కు పద్మశ్రీ
బిమల్ పటేల్ ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు అర్బనిస్ట్, విద్యావేత్త కూడా. దేశానికి గర్వకారణైన కీలక ప్రాజెక్టుల్లో పటేల్ భాగమయ్యారు. వీటిలో ప్రధానంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్, అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, పూరీలోని జగన్నాథ ఆలయ మాస్టర్ ప్లానింగ్ ఉన్నాయి. హైదరాబాద్‌లోని అగాఖాన్ అకాడమీ, ముంబైలోని అమూల్ డెయిరీ, చెన్నైలోని కంటైనర్ టెర్మినల్, ఐఐటీ జోధ్‌పూర్ నిర్మాణ రూపకల్పనతో సహా దేశవ్యాప్తంగా వివిధ పట్టణ నిర్మాణాలకు పటేల్, అతని కంపెనీ సహకారాన్ని అందించారు. పటేల్ చేసిన సేవలకు గాను 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
త్రిభుజాకార ఆకారంలో పార్లమెంట్ నిర్మాణం అందుకే
2019లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా బిమల్ హస్ముఖ్ పటేల్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్ సంస్థకు ఈ బిడ్ దక్కింది. ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పటేల్ దార్శనికత కనిపిస్తుంది. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకార ఆకారంలో నిర్మంచడం వెనుక పటేల్ భారీ ఆలోచనే చేశారు. సనాతన ధర్మ, సాంస్కృతి, ఆధ్యాత్మిక అంశాల మేళవింపుగా త్రిభుజాకారాన్ని ఎంచుకున్నారు. ఈ త్రిభుజాకార ఆకారం మూడు ప్రధాన స్థలాలను ప్రతిబింబిస్తుంది. అవి లోక్ సభ, రాజ్యసభ, సెంట్రల్ లాంజ్. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ద్వారా బిమల్ పటేల్ తన నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటారు.