LOADING...
Plane Accidents: సంజయ్‌గాంధీ నుంచి రూపాణీ వరకు.. భారతదేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు వీరే..
భారతదేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు వీరే..

Plane Accidents: సంజయ్‌గాంధీ నుంచి రూపాణీ వరకు.. భారతదేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు వీరే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో పలువురు రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ మరణించారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖుల జాబితా ఇలా ఉంది:

వివరాలు 

పైలట్ల తప్పిదంతో ప్రాణాలు కోల్పోయిన హోమీ జె భాభా 

భారత అణు శాస్త్రానికి పునాది వేశాడు హోమీ జహంగీర్ భాభా. ఆయన 1966 జనవరి 24న ఎయిర్ ఇండియా 101 అనే విమానంలో ప్రయాణిస్తుండగా, స్విట్జర్లాండ్‌లోని మోంట్ బ్లాంక్ శిఖరానికి ఢీకొని విమానం కూలిపోయింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పైలట్లు,జెనీవాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ మధ్య సరైన సంభాషణ లేకపోవడమేనని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ఏరోబాటిక్స్‌ చేస్తుండగా సంజయ్ గాంధీ మృతి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ,1980 జూన్ 23న విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. పైలట్ లైసెన్స్‌ కలిగిన ఆయన, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో విమానాన్ని ఏరోబాటిక్స్ కోసం నడిపే సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయాడు. ఈ ఘటనలో ఆయన మరణించారు.

వివరాలు 

వాతావరణ ప్రతికూలతతో మాధవ్‌రావ్ సింధియా  

భారత మాజీ విమానయాన శాఖ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాధవ్‌రావ్ సింధియా 2001 సెప్టెంబరు 30న కాన్పూర్‌ ఎన్నికల ప్రచార ర్యాలీకి వెళ్తుండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ 10 సీటర్ల విమానం మణిపురి సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. జీఎంసీ బాలయోగి తెదేపా నాయకుడు, అప్పటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన భీమవరం నుంచి బయలుదేరిన హెలికాప్టర్ కైకలూరు సమీపంలోని చెరువులో కూలిపోయింది. ప్రమాదంలో ఆయన మరణించారు.

వివరాలు 

సైప్రియన్ సంగ్మా హెలికాప్టర్ ప్రమాదం 

2004 సెప్టెంబర్ 22న, మేఘాలయ రాష్ట్ర మంత్రి సైప్రియన్ సంగ్మా సహా 9 మంది గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్తుండగా, పవన్ హాన్స్ హెలికాప్టర్ బారాపానీ సరస్సు సమీపంలో కూలిపోయింది. షిల్లాంగ్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. సినీ నటి సౌందర్య ప్రముఖ నటి సౌందర్య 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆమె ప్రయాణించిన సెస్నా-180 సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మరో నలుగురు చనిపోయారు. సౌందర్య వయస్సు 32 సంవత్సరాలు కాగా, ఆమె గర్భిణీ కూడా.

వివరాలు 

ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్  

2005 మార్చి 31న పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్, హరియాణాలో మంత్రి పదవిలో ఉన్న సమయంలో, మంత్రి సురీందర్ సింగ్‌తో కలిసి హెలికాప్టర్‌లో ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తుండగా, సహారన్‌పుర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఇద్దరూ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు 2011 ఏప్రిల్ 30న, అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు తవాంగ్ నుంచి ఇటానగర్‌కు బయలుదేరిన హెలికాప్టర్ వెస్ట్ కామెంగ్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అదుపుతప్పి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు ఉన్న నలుగురు మరణించారు.

వివరాలు 

తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌  

2021 డిసెంబరు 8న, దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ తన భార్యతో పాటు మరో 11 మంది తో కలిసి సూలూర్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తుండగా, కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. అందులోని అందరూ మరణించారు. నల్లమల అడవుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారడంతో హెలికాప్టర్ అదుపుతప్పి కుప్పకూలింది.