Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మూడ్రోజులగా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి.
రహదారులు, రైల్వే పట్టాలు ధ్వంసమవడంతో పాటు, పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.
కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఖమ్మం జిల్లాలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది.
ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాలు పంటలు నీట మునిగిపోయాయి.
మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నారు.
Details
సెలవులు పెట్టకూడదని ఆదేశాలు జారీ
సీఎం రేవంత్ రెడ్డి వర్షాల ప్రభావాన్ని సమీక్షించారు. 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అధికారులు ఎలాంటి సెలవులు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా, డీజీపీ, పురపాలక, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఖమ్మం జిల్లాకు సీఎం స్వయంగా వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను రిలీజ్ చేసింది.
వరద బాధితులను ఆదుకునేందుకు రూ. 5 కోట్లు తక్షణ సాయంగా విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Details
24 రైళ్ల రాకపోకలకు అంతరాయం
ప్రకృతి విపత్తుల్లో మరణించినవారికి సాయం మొత్తాన్ని రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు.
ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో బస చేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలోని వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, పరిస్థితులను సమీక్షించారు.
మహబూబాబాద్ జిల్లాలో నదులు, వాగులు పొంగి, రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం, మరికొందరు గల్లంతయ్యారు.