Telangana: తుదిదశకు చేరుకున్న యాదగిరిగుట్ట స్వర్ణ విమానం పనులు.. 19 నుంచి మహా కుంభాభిషేకం
ఈ వార్తాకథనం ఏంటి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానం (గోపురం) స్వర్ణ తాపడం పనులు తుదిదశకు చేరుకున్నాయి.
గత ఏడాది నవంబరులో ప్రారంభమైన ఈ పనులు ఫిబ్రవరి 13 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్వర్ణ విమానావిష్కరణ, మహాసంప్రోక్షణ సందర్భంగా మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
ఆలయంలో స్వర్ణ తాపడ పనుల పురోగతిని పలు మార్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్షించగా, 90 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ పనుల కోసం భక్తులు సమర్పించిన బంగారం, విరాళాలు, హుండీ ఆదాయాన్ని వినియోగిస్తున్నారు.
వివరాలు
నానో టెక్నాలజీతో 50 ఏళ్ల గ్యారంటీ
గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తులో, 10,857 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానానికి 68 కిలోల బంగారంతో తాపడం చేపడుతున్నారు.
తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఆలయ గోపురానికీ స్వర్ణ తాపడం జరగలేదు. నానో టెక్నాలజీ ద్వారా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తాపడంతో 50 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా రూపొందిస్తున్నామని తమిళనాడులోని మహాబలిపురం స్థపతి రవీంద్రన్ తెలిపారు.
యాదాద్రి దివ్య విమానానికి స్వర్ణ తాపడం చేయాలనే నిర్ణయం 2021లో తీసుకోగా, దానికి 165 కిలోల బంగారం అవసరమని ఆలయ స్థపతులు సూచించారు.
అయితే, సీఎం రేవంత్ రెడ్డి సందర్శన సందర్భంగా ఆలయ అధికారుల సూచనల మేరకు 68 కిలోల బంగారం సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
ఎన్నికల కమిషన్ అనుమతిస్తే..
మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి, చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా గోపురానికి స్వర్ణ కవచాలను అమర్చారు.
గంగా, యమునా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మద వంటి నదుల పవిత్ర జలాలతో ఫిబ్రవరి 23న మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు.
ఎన్నికల కమిషన్ అనుమతిస్తే, ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశముందని ఈవో తెలిపారు.
వివరాలు
ఫిబ్రవరి 23న స్వర్ణ విమానావిష్కరణ
యాదగిరిగుట్ట ఆలయ దివ్యవిమానానికి స్వర్ణ కవచాల బిగింపు పనులు ఫిబ్రవరి 13 నాటికి పూర్తవుతాయని ఈవో భాస్కర్ రావు తెలిపారు.
ఈ పనులు పూర్తయ్యాక పరంజా తొలగించి, కొత్తగా మెట్లతో స్టేజీ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు వానమామలై మఠం పీఠాధిపతి మధురకవి రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలో పారాయణం, మూర్తి, మంత్ర జపంతో పంచకుండాత్మక యాగం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 23న ఉదయం 11.54 గంటలకు 108 కలశాలతో మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వర్ణ విమానాన్ని ఆవిష్కరించనున్నారు.