ఐఎండీ అలర్ట్.. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు
భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్ అందింది. తెలంగాణతో పాటు ఉత్తర భారతంలో మరికొన్ని రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు ఆగస్టు 1 వరకూ పడే అవకాశం ఉంది. ఆదివారం నుంచి తూర్పు భారతంతో పాటు ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ లో వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి.
తెలంగాణలో ఇప్పటివరకూ 18 మంది మృతి
తెలంగాణలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో రోడ్లపై వరద నీరు చేరుకుంది. ఇక గోవా, కోంకణ్, మధ్య మహరాష్ట్ర ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఒడిశాలో ఈనెల 31 వరకూ, సిక్కింలో 29 వరకూ వర్షాలు పడతాయని, తర్వాత వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.