ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్
డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది. ఈ క్రమంలో ఆయా సంస్థలతో పాటు మరిన్ని కొత్త కంపెనీలు సైతం హైదరాబాద్ లోనే డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి. అమెజాన్ వెబ్‌సర్వీసెస్ సంస్థ సుమారు రూ.21 వేల కోట్లతో 3 డేటా కేంద్రాలను భాగ్యనగరంలో నిర్మించింది. ఇటీవలే వాటి మొదటిదశ కార్యకలాపాలను సైతం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు హైదరాబాద్ నుంచే డేటా సేవలు పొందుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి భూముల్లో ప్రపంచ స్థాయి డేటా సెంటర్లు
డేటా సెంటర్ల నిర్వహణలో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, నీటి లభ్యత కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఆయా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో హైదరాబాద్ మెరుగ్గా ఉంది. అందువల్ల ఇక్కడ డేటా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చందనవెల్లి, ఫ్యాబ్‌సిటీ, ఫార్మాసిటీల్లో మైక్రోసాఫ్ట్ మూడు డేటా కేంద్రాలను నిర్మించింది. ప్రస్తుతం అందులో కార్యకలాపాలను సైతం నిర్వహిస్తోంది. త్వరలోనే మరో 3 డేటా సెంటర్లను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోపక్క ఎయిర్‌టెల్ త్వరలోనే తన డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం షాబాద్ చందన్‌వెల్లి, మహేశ్వరంలోని ఫ్యాబ్‌సిటీ, ఇంటర్నేషనల్ డేటా సెంటర్లకు హబ్ గా మారాయి.
దిల్లీ, ముంబయి, చైన్నె కంటే హైదరాబాదే మిన్న
డేటా సెంటర్లు, కోస్తా తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సముద్ర గర్భ కేబుల్ కనెక్టివిటీ తదితర విషయాల్లో సానుకూలత ఉంటుంది. దేశంలోనే ముంబయి, చెన్నైల్లో తొలుత డేటా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ కి డేటా కనెక్టివిటీ మెరుగ్గా ఉండటం వల్ల డేటా సెంటర్లు ఇక్కడికి తరలివస్తున్నాయి. మెట్రో నగరాలు ముంబయి, చెన్నై, దిల్లీలతో పోల్చితే భాగ్యనగరంలో భూములు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా హ్యూమన్ రీసోర్స్, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల అనుకూలత నేపథ్యంలో పెద్ద సంస్థలన్నీ హైదరాబాద్ కే క్యూ కడుతున్నాయి. దీని ఫలితంగానే భాగ్యనగరం ఇంటర్నేషనల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు నిలయంగా మారుతుండటం విశేషం.