LOADING...
Hyundai: తెలంగాణలో  హ్యుందాయ్‌ భారీ టెస్ట్ సెంటర్‌ ఏర్పాటు .. రాష్ట్రంలో 675 ఎకరాల్లో రూ.8,528 కోట్లతో ప్రాజెక్టు 
తెలంగాణలో హ్యుందాయ్‌ భారీ టెస్ట్ సెంటర్‌ ఏర్పాటు

Hyundai: తెలంగాణలో  హ్యుందాయ్‌ భారీ టెస్ట్ సెంటర్‌ ఏర్పాటు .. రాష్ట్రంలో 675 ఎకరాల్లో రూ.8,528 కోట్లతో ప్రాజెక్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ, తన భారతీయ శాఖ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్‌ఎంఐఈ) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో ఒక భారీ కార్ల టెస్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ కేంద్రంలో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు,విద్యుత్ వాహనాల తయారీ సామర్థ్యంతో కూడిన ఆధునిక తయారీ యూనిట్‌ను కూడా స్థాపించనున్నారు. జహీరాబాద్‌లోని నిమ్జ్‌ (నేషనల్ ఇండస్ట్రియల్ మానుఫాక్చరింగ్ జోన్)లో దాదాపు 675 ఎకరాల విస్తీర్ణంలో రూ.8,528 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

వివరాలు 

సుమారు 4,200 స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు 

మొదట్లో హ్యుందాయ్ సంస్థ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని భావించినా,తాజాగా పరీక్షకు అవసరమైన కార్ల తయారీ యూనిట్‌ను కూడా ప్రారంభించాలని నిర్ణయించిందని పరిశ్రమల వర్గాలు తెలియజేశాయి. ఈ కొత్త కేంద్రం ద్వారా సుమారు 4,200 స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, హ్యుందాయ్ ప్రతినిధులు ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. వారు తెలంగాణ ప్రభుత్వంతో సమావేశమై తమ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న హెచ్‌ఎంఐఈ ఇంజినీరింగ్ కేంద్రాన్ని పునరుద్ధరించడం, ఆధునికీకరించడం,విస్తరించడం ద్వారా,సంస్థ భారత్‌తో పాటు ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించనుంది.

వివరాలు 

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పెట్టుబడుల సాధన 

రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా అధికారులు గత సంవత్సరం ఆగస్టు నెలలో దక్షిణ కొరియాను సందర్శించారు. ఆ పర్యటనలో సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. అప్పటికే నిమ్జ్‌లో రూ.3,000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చిన హ్యుందాయ్ సంస్థ, సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇంకా రూ.5,528 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు సిద్దమైనట్లు ప్రకటించింది.

వివరాలు 

కొత్త పరిశ్రమలో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్

ఈ మేరకు, రాష్ట్ర పెట్టుబడుల ప్రచార మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల సమావేశమై ఈ ప్రాజెక్టును ఆమోదించిందని సమాచారం. ఈ కొత్త పరిశ్రమలో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ టెస్ట్ ట్రాక్, ప్రొటోటైపింగ్ సిస్టమ్‌లు ఉండనున్నాయి. ఇవన్నీ భారత్‌లో అధునాతన టెక్నాలజీతో కూడిన తయారీ వ్యవస్థకు కీలకంగా నిలవనున్నాయి.