Page Loader
Polavaram: పోలవరం వెనుక జలాల ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ సమగ్ర అధ్యయనం 
పోలవరం వెనుక జలాల ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ సమగ్ర అధ్యయనం

Polavaram: పోలవరం వెనుక జలాల ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ సమగ్ర అధ్యయనం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి నదిలో వెనుక జలాల ముంపుతో , తెలంగాణ రాష్ట్రంలో తలెత్తే ముంపు పరిస్థితులపై ఐఐటీ హైదరాబాద్(IIT-H)త్వరలో సమగ్ర అధ్యయనం చేయనుంది. ఈఅధ్యయనంలో మొత్తం ఏడు కీలక అంశాలను పరిశీలించి, తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఈఏడాది జనవరిలో న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పోలవరం ముంపు అంశంపై సుదీర్ఘ అధ్యయనం చేయాల్సిన అవసరముందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 2022లో గోదావరికి వచ్చిన భారీ వరదల దృష్ట్యా,పోలవరం వెనుక నీటి నిల్వ వల్ల ఏర్పడిన నష్టం,పరిణామాలపై క్షుణ్నంగా విశ్లేషించాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించారు. దీనితో నీటిపారుదల శాఖ ఐఐటీ హైదరాబాద్‌తో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

వివరాలు 

ఇప్పుడు ఐఐటీ హైదరాబాద్ చేపట్టే అధ్యయన అంశాలు ఇవే: 

ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అధ్యయనానికి సంబంధించిన ఏడు అంశాలను వివరిస్తూ ఐఐటీకి లేఖ రాశారు. అలాగే, ఈ అధ్యయనం నిర్వహణకు అవసరమైన ₹19.40 లక్షల నిధులను విడుదల చేస్తూ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజా ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం పట్టణ భౌగోళిక పరిమితులపై అధ్యయనం: భద్రాచలం పట్టణం మరియు ప్రధాన నిర్మాణాలున్న ప్రాంతాలకు సంబంధించిన జియోగ్రాఫికల్ హద్దుల (Geographical Boundaries)ను గుర్తించి విశ్లేషించనున్నారు. నదీ ప్రవాహ మార్గంపై అంచనా: దుమ్ముగూడెం నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకూ గోదావరి ప్రవాహ మార్గాన్ని అధ్యయనం చేసి, ఏ ప్రాంతాల్లో ప్రవాహం ఎలా ఉన్నదీ పరిశీలించనున్నారు.

వివరాలు 

వాగుల ఉధృతి అంచనా

ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద ముంపు పరిణామాల విశ్లేషణ: పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ స్థాయి (Full Reservoir Level - FRL) అయిన 45.72 మీటర్ల వద్దకు గోదావరికి ఒకే సమయంలో 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చితే, తెలంగాణ భూభాగంలో ముంపు ప్రభావం ఎంత ఉండబోతుందనే అంశాన్ని అధ్యయనం చేస్తారు. ప్రాంతీయ వాగులు, వర్షపాత ప్రభావంపై అధ్యయనం: దుమ్ముగూడెం ఆనకట్ట దిగువన ఉన్న కిన్నెరసాని వాగు సహా ఇతర చిన్న వాగుల ఉధృతిని అంచనా వేస్తారు. వర్షాకాలంలో భద్రాచలం పట్టణం నుండి నదిలోకి విడుదలయ్యే ప్రవాహం ఎలా నిర్వహించాలో పరిశీలన జరుగుతుంది.

వివరాలు 

వరద నివారణకు తీసుకోవాల్సిన చర్యలు

కేంద్ర జల సంఘం నమూనా ఆధారంగా పరిశీలన: కేంద్ర జల సంఘం (CWC) రూపొందించిన నమూనా అధ్యయనాలను అనుసరిస్తూ, భద్రాచలం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో వరదల వల్ల తలెత్తే పరిస్థితులపై చర్చిస్తారు. వెనుక జలాల గణాంకాల సేకరణ: పోలవరం వెనుక నీటి నిల్వ వల్ల ఎంత భూభాగం ముంపులోకి వస్తుందో, ఏ స్థాయిలో ప్రమాదం ఏర్పడుతుందో వంటి గణాంకాలను సేకరిస్తారు. రక్షణ చర్యల రూపకల్పన: వరద నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ముంపు సమయంలో సహాయక చర్యల ప్రణాళికలు, పురావస్తు కట్టడాల పరిరక్షణ మరియు దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించనున్నారు.