IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలతో దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా ఊర్లకు ఊర్లే చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్‌లో భారీ వర్షాలు గుజరాత్ రాష్ట్రం తీవ్ర వర్షపాతం కారణంగా కష్టాలు ఎదుర్కొంటోంది. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే వల్సాడ్‌లో ఒక్క రాత్రి 12 సెంటీమీటర్ల వర్షం పడింది.
సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలు
సూరత్‌లో తాపి నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. డ్రైనేజీలు తెరుచుకున్నాయనే భయంతో వాహనదారులు ముందుకు కదలడం లేదు. పంటలు నీట మునిగాయి. గుజరాత్‌లోని పలు జలపాతాలు వరద నీటితో నిండిపోయాయి. మణిపూర్‌లో పరిస్థితి మణిపూర్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో చాలామంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇక్కడ 130 కుటుంబాలు సహాయక శిబిరంలో ఉంటున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే మరిన్ని ఇళ్లు నీట మునిగే అవకాశముందని స్థానికులు వాపోతున్నారు.. వాగువంకలు ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
రాజస్థాన్‌లో వర్షాలు రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. ఫోయ్‌సాగర్ సరస్సు పొంగి పొర్లుతోంది. ఐఎండీ సూచనలు భారత వాతావరణ శాఖ రాబోయే 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గుజరాత్‌కు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాలకు రెడ్, ఆరంజ్, ఎల్లో అలెర్ట్‌లు జారీ చేసింది. ఒడిశాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.