
IMD forecast : దేశంలో వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలు: హీట్‌వేవ్‌లు, వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశవ్యాప్తంగా రానున్న వాతావరణ పరిణామాలపై కీలకమైన నివేదికను విడుదల చేసింది.
ఇందులో భాగంగా, ఏప్రిల్ 15వ తేదీ నుంచి గుజరాత్‌తో పాటు వాయువ్య భారతదేశంలో వేడిగాలుల ప్రభావం కనిపించనుందని స్పష్టం చేసింది.
అదే సమయంలో తూర్పు భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో నాలుగు నుండి ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ వర్షాలు పడతాయని వెల్లడించింది.
వివరాలు
హీట్‌వేవ్‌లపై హెచ్చరికలు
వాయువ్య భారతదేశంలోని ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ 13 నుండి 18 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
ఏప్రిల్ 14న ఢిల్లీలో ఆకాశం ప్రధానంగా స్పష్టంగా ఉండే అవకాశం ఉంది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 38 నుండి 40 డిగ్రీల మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రత 21 నుండి 23 డిగ్రీల మధ్య ఉండనుందని తెలిపింది.
ఈ వాతావరణ పరిస్థితులు ఏప్రిల్ 15న కూడా కొనసాగుతాయి. ఆ రోజున గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 నుండి 41 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.
కనిష్ఠ ఉష్ణోగ్రత 22 నుండి 24 డిగ్రీల మధ్య ఉండొచ్చని వివరించింది.
వివరాలు
భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు
ఏప్రిల్ 16న ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
అప్పుడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల మధ్య ఉండగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 నుండి 25 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది.
ఐఎండీ ప్రకారం, వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ 13 నుండి 18 వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా 3-5 డిగ్రీల వరకూ పెరగడం కొనసాగుతుంది.
అలాగే మధ్యభారతదేశంలో ఏప్రిల్ 14 నుంచి 19 మధ్య 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
దేశంలోని మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని తెలిపింది.
వివరాలు
వడగాలుల ప్రభావిత ప్రాంతాలు
ఏప్రిల్ 14న పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది.
ఏప్రిల్ 16 నుండి 18 వరకు మరిన్ని ప్రాంతాల్లో, అలాగే ఏప్రిల్ 19న కొన్ని చోట్ల వడగాలులు వీస్తాయని వెల్లడించింది.
తెలంగాణలో ఏప్రిల్ 14న, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఏప్రిల్ 15-19 మధ్య, గుజరాత్‌లో ఏప్రిల్ 15-17 మధ్య, పంజాబ్, హర్యానాలో ఏప్రిల్ 16-18 మధ్య, తూర్పు రాజస్థాన్‌లో ఏప్రిల్ 16-19 మధ్య వేడి గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
వివరాలు
తూర్పు, ఈశాన్య భారతదేశంలో వర్షాలు
రానున్న ఐదు రోజుల్లో ఈశాన్య భారతదేశం మరియు తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఏప్రిల్ 14-16 మధ్య అసోం, మేఘాలయల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఒడిశాలో కూడా భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.
అదే విధంగా, ఏప్రిల్ 15న పశ్చిమ బెంగాల్, ఒడిశా, కోస్తాంధ్ర, యానాం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో, ఏప్రిల్ 14, 15 తేదీల్లో ఝార్ఖండ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
వివరాలు
దక్షిణాదికి వర్ష సూచనలు
దక్షిణ భారతదేశానికి సంబంధించి రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తర అంతర్గత కర్ణాటక, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అంతేకాకుండా, రానున్న మూడు రోజుల పాటు దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఇదే విధమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.