LOADING...
LAC:'ఎల్‌ఏసీ'పరిస్థితిపై భారత్‌-చైనా సమీక్ష  
'ఎల్‌ఏసీ'పరిస్థితిపై భారత్‌-చైనా సమీక్ష

LAC:'ఎల్‌ఏసీ'పరిస్థితిపై భారత్‌-చైనా సమీక్ష  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-చైనా దేశాలు తూర్పు లడఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి అవసరమైన తదుపరి చర్యలపై చర్చించేందుకు, రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ దిశగా, ఢిల్లీలో నిర్వహించిన "వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్" (డబ్ల్యూఎంసీసీ) సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి,సామాన్య పరిస్థితుల నెలకొల్పడం ద్వారానే ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చని ఇరుపక్షాలూ అభిప్రాయపడ్డాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

వివరాలు 

 తదుపరి దశ చర్చలకు భారత్-చైనా రెడీ 

ప్రస్తుతం చేపట్టిన చర్చలు ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మద్దతివ్వగలవని భావిస్తున్నారని కూడా ఎంఈఏ పేర్కొంది. ఇదే క్రమంలో ఈ సంవత్సరం చివర్లో భారత్‌లో జరిగే ప్రత్యేక ప్రతినిధుల (ఎస్‌ఆర్) తదుపరి దశ చర్చలకు భారత్-చైనా రెడీ అయ్యాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రౌండ్ చర్చల్లో భారతవైపు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ నేతృత్వం వహించనుండగా, చైనాను అటు దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ చర్చలకూ ముందు వాంగ్ యి భారతదేశాన్ని సందర్శించనున్న అవకాశముంది. గత తొమ్మిది నెలలుగా ఇరు దేశాలు పరస్పర సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

వివరాలు 

భారత్-చైనా మధ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు 

ఘర్షణ పాయింట్ల వద్ద నుంచి ఇరుపక్షాలు తమ సైనిక దళాలను వెనక్కు తీసుకున్నప్పటికీ, తూర్పు లడఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి సుమారు 60,000 మంది సైనికులు ఇంకా మోహరించి ఉన్నారు. ఎస్‌సీఓ (షాంఘై సహకార సంస్థ) విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్న అనంతరం డబ్ల్యూఎంసీసీ చర్చలు ప్రారంభమయ్యాయి. 2020 జూన్‌లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ, భారత్-చైనా మధ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటన అనంతరం పరిస్థితిని చక్కబెట్టేందుకు ఇరు దేశాలు పలు దఫాలుగా చర్చలు నిర్వహించాయి.

వివరాలు 

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలనే నిర్ణయం 

ఈ క్రమంలో, 2023 అక్టోబర్ 21న ఒక కీలక ఒప్పందానికి రెండు దేశాలు చేరుకున్నాయి. దాని ప్రకారం డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి సైనిక దళాలను వెనక్కు మళ్లించారు. అంతేకాక, అదే అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీలో, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు.