Page Loader
G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలు
కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలు

G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని అల్బెర్టా రాష్ట్రంలో జూన్‌ 15 నుండి 17వ తేదీ వరకు జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌కు ఇప్పటికీ ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో, గత ఆరు సంవత్సరాల్లో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంతర్జాతీయ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికాకు అనుమతి ఇచ్చిన తరువాత ఇదీ మరో దౌత్యపరమైన అపజయమేనని వ్యాఖ్యానించింది.

వివరాలు 

ఆహ్వానం వచ్చినా సరే, ప్రధాని ఈ సమావేశానికి వెళ్లకపోవచ్చనే వాదన

ఈ ఏడాది జీ7 సదస్సు కెనడాలో జరగనుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రధాన అంతర్జాతీయ అంశాలు, అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ ప్రధానికి అధికారికంగా ఆహ్వానం పంపలేదని సమాచారం. పైగా, ప్రస్తుత భారత్-కెనడా మధ్య నెలకొన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే, ఆహ్వానం వచ్చినా సరే, ప్రధాని ఈ సమావేశానికి వెళ్లకపోవచ్చనే వాదన ఉంది. ఫలితంగా, మోదీ జీ7 సదస్సుకు హాజరుకాకపోవడం ఆరేళ్లలో మొదటిసారి అవుతుంది.

వివరాలు 

2014కు ముందు వరకు జీ8గా ఈ సమితి ఉండేది 

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ స్పందించారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడా, జర్మనీ దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా నేతలకు కూడా ఆహ్వానం అందిందని తెలిపారు. 2014కు ముందు వరకు జీ8గా ఈ సమితి ఉండేదనీ, అప్పట్లో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌కి ఆహ్వానం వస్తుండేదనీ గుర్తుచేశారు. 2014 తర్వాత కూడా ఈ సంప్రదాయం కొనసాగినప్పటికీ, ఈసారి ప్రధానికి ఆహ్వానం రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దీన్ని చూస్తే, ఇది ఒక గంభీరమైన దౌత్యపరమైన పరాజయమేనని విమర్శించారు.

వివరాలు 

జీ7 సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఇదిలాఉంటే, జీ7 దేశాల్లో భారత్‌ లేకున్నప్పటికీ.. ఆ సమావేశాన్ని నిర్వహించే దేశం ప్రత్యేక ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రధాని మోదీ వాటిలో పాల్గొనడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు, గత ఏడాది ఇటలీలో జరిగిన జీ7 సదస్సులో భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు హాజరయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఆ సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.