
COVID-19: భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో మరోసారి కొవిడ్-19 మహమ్మారి కలకలం రేపుతోంది.
ఇటీవల గత వారం రోజుల వ్యవధిలో నగరంలో కొత్తగా 100కి మించి కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
2020లో ప్రపంచాన్ని వణికించిన ఈ ప్రాణాంతక వైరస్ మళ్లీ విజృంభించడమే కాదు, ఇప్పటికే యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం అధికారులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితిని తలపిస్తోంది.
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,009కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్-19 బులెటిన్‌లో పేర్కొంది.
ఢిల్లీలో ప్రస్తుతం 104 యాక్టివ్ కేసులు ఉండగా, అందులో 99 కేసులు ఈ వారం రోజుల్లోనే నమోదయ్యాయి.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే,కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వివరాలు
కర్ణాటకలో ఒక్కరు కొవిడ్ వల్ల మృతి
మహారాష్ట్రలో 209 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ 104 కేసులతో మూడవ స్థానంలో నిలిచింది.
అలాగే గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో నాలుగు, కేరళలో రెండు, కర్ణాటకలో ఒక్కరు కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కొన్నిప్రాంతాల్లో మాత్రం కొవిడ్ ప్రభావం కనిపించలేదు.
అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.