
#NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాలు..చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న ఈ తరుణంలో, పాకిస్తాన్‌కు శక్తివంతమైన డ్రోన్లను అందించిన టర్కీపై (తుర్కియే) భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.
కోవిడ్ సమయంలో టర్కీకి వ్యాక్సిన్లు పంపినా, అక్కడ భారీ భూకంపం సంభవించినప్పుడు స్వచ్ఛందంగా సహాయం అందించినా.. ఏమాత్రం విశ్వాసం చూపని ఆ దేశంపై భారత సమాజం తీవ్రస్థాయిలో మండిపడింది.
టర్కీ వ్యవహారశైలి గురించి చాలామందికి స్పష్టత లేకపోయినా, భారత ప్రభుత్వానికి మాత్రం టర్కీ అసలైన ధోరణి గురించి మునుపటి నుంచే అవగాహన ఉంది.
ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన రక్షణ కూటమి అయిన నాటో (NATO)లో సభ్యత్వం కలిగిన దేశం టర్కీ.
వివరాలు
కాశ్మీర్ అంశంపై టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు
అలాంటి దేశం పాకిస్తాన్‌కు డ్రోన్లు ఇచ్చి, భారత్ కు వ్యతిరేకంగా పనిచేయడంతో ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ప్రత్యేకించి కాశ్మీర్ అంశంపై టర్కీ ఎప్పటి నుంచో పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ, భారత్‌కు విఘాతం కలిగించే విధంగా మాటలే కాకుండా చర్యల్లోనూ చూపిస్తోంది.
తాజాగా భారత్ ఈ వ్యవహారానికి గట్టిగా స్పందిస్తున్న నేపథ్యంలో, భారత్-టర్కీ సంబంధాల చరిత్రను, తాజా పరిణామాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
వివరాలు
చారిత్రాత్మక నేపథ్యం: సద్భావన నుంచి విభేదాల దాకా
టర్కీ పశ్చిమ ఆసియాలో ఒక శక్తివంతమైన దేశం మాత్రమే కాదు,దాని GDP కూడా ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా ఉంది.
ఇది ప్రపంచ రాజకీయాల్లో తనదైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంది.అయితే భారత్-టర్కీ సంబంధాలు ప్రాచీనకాలం నుంచి కొంత క్లిష్టంగా ఉన్నాయి.
1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం,ఓటమిని చవిచూసిన ఒట్టోమన్ సామ్రాజ్యం క్షీణించడంతో,అక్కడి ఖలీఫా పతనం ఎదురయ్యింది.
ఖలీఫాను ముస్లింలు ఆధ్యాత్మిక నాయకుడిగా భావించేవారు.ఖలీఫా పదవిని రక్షించేందుకు భారత ముస్లింలు,ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుతో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ ఉద్యమం విఫలమైనప్పటికీ, టర్కీలో భారతదేశం పట్ల సద్భావన ఏర్పడేలా చేసింది.
అయితే 1947లో భారత్-పాకిస్తాన్ విభజన తర్వాత ఆ సానుభూతి పాకిస్తాన్ వైపు మళ్లింది.
వివరాలు
కోల్డ్ వార్ - వ్యూహాత్మక విభేదాలు
అప్పటి నుండి టర్కీ వ్యూహాత్మకంగా భారత్‌కు దూరమవుతూ, పాకిస్తాన్‌కు దగ్గరైంది.ఈ దశలో రెండు ప్రధాన విభేదాలు వెలుగులోకి వచ్చాయి — కోల్డ్ వార్, కాశ్మీర్ అంశం.
నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అలీన విధానాన్ని అనుసరించగా, టర్కీ మాత్రం నాటోలో చేరి అమెరికా శ్రేణిలో నిలిచింది.
1955లో ఏర్పడిన బాగ్దాద్ ఒడంబడికలో టర్కీ, పాకిస్తాన్ సభ్యదేశాలుగా ఉండడం భారత్‌లో ఆందోళన కలిగించింది.
అంతేకాకుండా 1954లో టర్కీ-పాకిస్తాన్ రక్షణ ఒప్పందంతో పాకిస్తాన్‌తో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
భారత్ టర్కీతో సంబంధాలు మెరుగుపరచేందుకు ప్రయత్నించినా, ఆశించిన ఫలితాలు రాలేదు.
వివరాలు
కాశ్మీర్ అంశం: కీలక విభేదానికి కేంద్ర బిందువు
టర్కీ పాకిస్తాన్‌కు సన్నిహితమవ్వడంతో, కాశ్మీర్ విషయంలోనూ అది పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టింది.
1965, 1971 యుద్ధాల్లో కూడా టర్కీ పాకిస్తాన్ వైపు నిలవడంతో, భారత్ దీన్ని ప్రతిఘటిస్తూ టర్కీతో సరిహద్దు సమస్యలున్న సైప్రస్‌కు మద్దతు తెలిపింది.
కోల్డ్ వార్ ముగిసిన తరువాత, మధ్యవర్తిత్వంతో తిరిగి సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించాయి.
టర్కీ ప్రధాని తుర్గుత్ ఓజల్ 1986లో భారత్ వచ్చినపుడు, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో కాశ్మీర్, సైప్రస్ అంశాల్లో శాంతియుత దృక్పథం అవలంబించాలనే అంగీకారం నెలకొంది.
వివరాలు
సంబంధాలలో ఎత్తుపల్లాలు
1991లో టర్కీ OIC వేదికపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తినప్పటికీ,2000లో టర్కీ ప్రధాని బులెంట్ ఎసెవిట్ భారత పర్యటనతో సంబంధాలు మెరుగయ్యాయి.
ఎసెవిట్, భారత్ పట్ల అనుకూలంగా వ్యవహరించడమేగాక, ముషారఫ్ పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల రెండు దేశాల మధ్య భద్రతా,ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యాయి.
2003లో వాజ్‌పేయి టర్కీకి వెళ్లారు.కానీ ఇదంతా తాత్కాలికమేనని తర్వలోనే స్పష్టమైంది.
2003లో రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అధికారంలోకి వచ్చాక మొదట సంబంధాలు మెరుగుపరచాలని ప్రయత్నించినా,2008తర్వాత ఆయన పాలన టర్కీని పాకిస్తాన్‌కు మరింత దగ్గర చేసింది.
ఈస్లామిక్ దేశాలతో సన్నిహిత సంబంధాలపై ఆయన ఆసక్తి వల్ల,కాశ్మీర్ అంశంపై గట్టిగా మాట్లాడటం, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రతిస్పందనగా వ్యవహరించడం మొదలయ్యాయి.
పాకిస్తాన్‌తో డ్రోన్లు,మిస్సైళ్ల సహకారం పెరగడం కూడా ఇదే సమయంలో జరిగింది.
వివరాలు
తాజా ఉద్రిక్తతలు - ఆపరేషన్ సిందూర్, డ్రోన్ వివాదం
2019లో కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత టర్కీ ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని లేవనెత్తి భారత్‌ను విమర్శించింది.
దీన్ని ఖండిస్తూ ప్రధాని మోడీ టర్కీ పర్యటనను రద్దు చేశారు. తాజా ఉద్రిక్తతల్లో "ఆపరేషన్ సిందూర్" పేరుతో భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా దాడులు చేయగా, టర్కీ దీన్ని ఖండించింది.
అంతేకాక, టర్కీ తయారు చేసిన డ్రోన్లు ఈ దాడుల్లో పాకిస్తాన్ చేతిలో ఉన్నాయని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
వ్యాపార-విద్య సంబంధాల్లో కోతలు
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ టర్కీతో విద్యా, వ్యాపార రంగాల్లో కోతలు పెట్టింది.
టర్కీ పర్యటనను బహిష్కరించాలన్న సోషల్ మీడియా ప్రచారం ఉధృతమవుతోంది.
ఇదే సమయంలో, టర్కీ ప్రత్యర్థులైన గ్రీస్, సైప్రస్, ఆర్మేనియాలతో భారత్ మైత్రి సంబంధాలను బలోపేతం చేస్తోంది.
ఆర్మేనియాకు భారత ఆయుధాలు సరఫరా చేయడం దీనికి నిదర్శనం.
వివరాలు
భవిష్యత్ దిశ: మరింత దిగజారే పరిస్థితి?
టర్కీ తన నైతిక విధానాన్ని మార్చుకోకపోతే, భారత్-టర్కీ సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది.
టర్కీ కాశ్మీర్ విషయంలో పాక్ వైపు ఉండడం, డ్రోన్ల సహకారం వంటి అంశాలు భారత భద్రతా వ్యూహంపై ప్రభావం చూపుతాయి.
ఈ పరిస్థితిలో టర్కీ ప్రాంతీయ శత్రువులతో సంబంధాలు బలోపేతం చేసి, భారత్ తన వ్యూహాత్మక ప్రతిస్పందనను కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.