రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఆలోచనలు కీలక చర్చలు జరిపారు. రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి సముద్ర, సైనిక, ఏరోస్పేస్ డొమైన్‌లలో సాంకేతికతల సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంపై ధోవల్, ఆస్టిన్ చర్చించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా యూఎస్ నుంచి భారతదేశంకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ బదిలీ చేయడం, ఉత్పత్తి, రెండు దేశాల మధ్య స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఇద్దరు దృష్టి సారించారు.
భారత్-అమెరికా భాగస్వామ్యం ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛకు మూలస్తంభం
రెండు రోజులపాటు భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా విస్తృత చర్చలు జరిపారు. రక్షణ-పారిశ్రామిక సహకారం కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని భారతదేశం, అమెరికా నిర్ణయించుకున్నాయని ఆస్టిన్ చెప్పారు. భారతదేశం-యూఎస్ ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్వేచ్ఛా ఇండో-పసిఫిక్‌కు మూలస్తంభం అని ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో భారత్‌లో ఆస్టిన్ పర్యచింటి, రక్షణ సహకారంపై చర్చలు జరపడం గమనార్హం.