
#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కొనసాగుతున్న వివాదం: మారుతున్న రాజకీయ నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత దశాబ్దకాలంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతిని ప్రకటించి, 2015లో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
తాత్కాలిక అసెంబ్లీ భవనం, సచివాలయం వంటి మౌలిక నిర్మాణాలు కూడా పూర్తిచేసింది.
అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల గుర్తించి ప్రతిపాదన చేసింది.
తాజాగా, 2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని కూటమి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించింది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేత రాజధాని పనులకు శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
వివరాలు
భూ సమీకరణపై వైసీపీ అభ్యంతరాలు
ఈ పరిణామాల నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
రాజధాని విషయంలో పార్టీ తన వైఖరిని మరోసారి ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ మూడు రాజధానుల వైపు ఉండబోతుందా లేక అమరావతినే రాజధానిగా అంగీకరించనున్నదా అన్నది ప్రశ్నగా మారింది.
వైసీపీ మొదట అమరావతి ప్రకటనకు అసెంబ్లీలో మద్దతిచ్చినా,భూముల సమీకరణపై తీవ్ర విమర్శలు చేసింది.
రాజధాని కోసం 33,000 ఎకరాల ఉత్పాదక వ్యవసాయ భూములను తీసుకోవాడంపై విమర్శలు గుప్పించింది.
ఈ భూసేకరణ పద్ధతిని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు 2015లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. అంతేకాదు, అనంతరం అమరావతి భూవివాదంలో వేల కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు.
వివరాలు
బొత్స ప్రకటనతోనే మొదలు..
2019 ఎన్నికల ముందు టీడీపీ నేతలు వైసీపీ విధానంపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, జగన్ రాజధానిపై తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతే కాదు తాడేపల్లిలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు స్వంతిల్లు లేదంటూ విమర్శలు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బొత్స సత్యనారాయణ 'అమరావతిలో ఏముంది... స్మశానం' అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తర్వాత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి ప్రతిపాదించారు.
అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వివరాలు
వైసీపీ విధానం - న్యాయం, వికేంద్రీకరణ, వ్యయం
"జగన్ అభివృద్ధి ఒక్క ప్రాంతానికి పరిమితం కావకూడదని,హైదరాబాద్ పాఠాలను గుర్తు చేస్తూ వికేంద్రీకరణ అవసరం ఉందని చెప్పారు."
అమరావతిలో మౌలిక వసతుల కోసం రూ.1.0 లక్షల కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంటూ, టీడీపీ పాలనలో ఖర్చైన మొత్తం కేవలం రూ.5,300కోట్లు మాత్రమేనని విమర్శించారు.
2020లో సీఆర్డీయే రద్దు,మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ఆమోదించబడ్డాయి.
శాసనమండలిలో ఓటమి అనంతరం మళ్లీ అసెంబ్లీలో ఆమోదించబడిన తర్వాత ఈబిల్లులకు గవర్నర్ ఆమోదం లభించింది.
కానీ భూములిచ్చిన రైతులు,టీడీపీ,బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశాయి.
హైకోర్టు తుదితీర్పులో శాసనసభకు రాజధాని మార్చే అధికారం లేదని పేర్కొంది.
అమరావతి అభివృద్ధికి సమయపాలనతో మార్గనిర్దేశం చేసింది.ఆతర్వాత వైసీపీ ప్రభుత్వం 2022లో రెండు చట్టాలను ఉపసంహరించుకుంది.
వివరాలు
వైసీపీ మేనిఫెస్టోలో రాజధానిపై ఏముంది?
ముగ్గురు రాజధానులపై వైసీపీ మేనిఫెస్టో 2024లో కూడా క్లారిటీ ఇచ్చింది.
విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న హామీ ఇచ్చింది.
కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశంపై స్పష్టత లోపించింది.
ఇప్పుడు మళ్లీ బొత్స ప్రకటన..
''మూడు రాజధానులనేది ఆ రోజు మా విధానం.. ఇప్పుడు మా విధానం ఏమిటనేది చర్చించి చెబుతాం'' - అని బొత్స పేర్కొనడంపై పార్టీ స్టాండ్ లో మార్పు ఉంటుందా అన్న అనుమానాలు కలిగించాయి.
వివరాలు
రాజకీయ విశ్లేషకుల అంచనాలు
ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగే నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన విధానం మార్చుకుంటారనే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.