
S Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై జైశంకర్ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.
ఈ దాడిని ఆయన "అనాగరిక చర్య"గా అభివర్ణించారు. కశ్మీర్‌లో పర్యాటకాన్ని నాశనం చేయడం, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టడం వంటి ఉద్దేశంతోనే ఈ దాడి జరిగింది అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం డెన్మార్క్, నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడుతూ పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను తీవ్రంగా విమర్శించారు.
మునీర్‌కు "తీవ్రమైన మతపరమైన దృక్పథం" ఉందని అన్నారు.
వివరాలు
లష్కరే ఉగ్రవాదుల దాడి వెనుక మతపరమైన ముప్పు
జైశంకర్ తెలిపిన వివరాలప్రకారం..పహల్గామ్‌లో జరిగిన దాడిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మతాన్ని నిర్ధారించిన తర్వాత కుటుంబ సభ్యుల ఎదుటే 26మందిని హత్య చేసినట్టు తెలిపారు.
ఇది మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చేసిన చర్యగా పేర్కొన్నారు.పర్యాటకం ద్వారా జీవించే కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు తెలిపారు.
ఆసిమ్ మునీర్‌కు పాక్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ పదోన్నతి
ఇక మరోవైపు,పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్‌ను పాక్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతిని ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈనిర్ణయం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్టు సమాచారం.
భారత్‌తో ఎదురైన పోరులో మునీర్ నాయకత్వం చూపించడమే ఈపదోన్నతికి కారణమని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన మునీర్
ఫీల్డ్ మార్షల్ హోదా పాకిస్థాన్ మిలిటరీలో అత్యున్నత ర్యాంక్‌గా గుర్తించబడుతుంది.
ఇప్పటివరకు ఈ హోదా పొందిన వ్యక్తుల్లో మునీర్ రెండవవారు కావడం గమనార్హం.
ఇంతకుముందు 1959లో జనరల్ ఆయుబ్ ఖాన్‌కు ఈ ర్యాంకు దక్కింది. మునీర్ 2022 నవంబర్‌లో పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల పాక్ సుప్రీంకోర్టు ఆయనకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ మిలిటరీ కోర్టుల్లో పౌరులను విచారించేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందడంతో మునీర్ ప్రాబల్యం మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.