LOADING...
Kalyan Banerjee: చీఫ్‌ విప్‌ పదవికి కల్యాణ్‌ బెనర్జీ రాజీనామా 
చీఫ్‌ విప్‌ పదవికి కల్యాణ్‌ బెనర్జీ రాజీనామా

Kalyan Banerjee: చీఫ్‌ విప్‌ పదవికి కల్యాణ్‌ బెనర్జీ రాజీనామా 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. తనపై అన్యాయంగా ఆరోపణలు వస్తున్నాయని, సభలో ఎంపీల మధ్య సరైన సమన్వయం లేదన్న కారణంతో తనకే నిందలు వస్తుండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పార్టీకి చెందిన ఎంపీలు చాలామంది లోక్‌సభ సమావేశాలకు కూడా హాజరయ్యే పరిస్థితి లేదని ఆయన వాపోయారు. ఇటీవల టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఎంపీలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఆ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల్లో సరైన సమన్వయం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కల్యాణ్ బెనర్జీ,"పార్లమెంటరీ పనిలో సమన్వయం లేదని దీదీ వ్యాఖ్యానించారు.

వివరాలు 

మహువా మొయిత్రా, కల్యాణ్‌ బెనర్జీ మధ్య తరచూ విభేదాలు

అందుకు నేనే కారణం. అందుకే, రాజీనామా చేస్తున్నా'అని వివరించారు. పార్లమెంట్‌కు తరచూ డుమ్మాకొట్టే వారిని, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని వదిలేసి ప్రతిదానికీ తననే తప్పుపట్టడంపై కల్యాణ్‌ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. "విధేయత పాటించని వారు, సభకు డుమ్మా కొట్టే వారు ప్రశ్నించబడకుండా ఉండిపోతే, ఏ విషయంలోనైనా నన్నే బాధ్యుణిగా చూపడం న్యాయమా?" అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, కల్యాణ్‌ బెనర్జీ మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు మరో ఎంపీ కీర్తి ఆజాద్‌తోనూ కల్యాణ్‌కి విభేదాలు తలెత్తాయని, ఆ సంఘటనలన్నీ పార్టీకి తలనొప్పిగా మారాయని పేర్కొంటున్నారు.

వివరాలు 

ఓ ఎంపీ తనను వ్యక్తిగతంగా అవమానించినా పార్టీ నాయకత్వం మౌనందాల్చిందంటూ..

ఇటీవల జరిగిన ఒక సంఘటన తాజా పరిణామాలకు దారితీసిందని చెబుతున్నారు. ఓ ఎంపీ తనను వ్యక్తిగతంగా అవమానించినప్పటికీ పార్టీ లీడర్షిప్ మౌనంగా ఉండిపోవడం తనకు బాధ కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే మహువా మొయిత్రా‌ను ఉద్దేశించిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. "లోక్‌సభ ఎంపీల మధ్య తగాదాలు జరుగుతున్నాయని దీదీ అంటున్నారు. మరి నన్ను కించపరిచిన వారిపై చర్యలు తీసుకోకూడదా? నేను నేతలకు చెప్పినా, తప్పే నాదేనంటున్నారు. మమతా బెనర్జీ తన ఇష్టానుసారంగా పార్టీని నడిపించుకుంటున్నారు, అలాగే నడిపించుకోనివ్వండి" అంటూ కల్యాణ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

వివరాలు 

పార్లమెంటరీ పార్టీలో కీలక మార్పులు - అభిషేక్ బెనర్జీకి నూతన బాధ్యతలు 

ఈ నేపథ్యంలో టీఎంసీ పార్లమెంటరీ విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి ఇప్పుడు లోక్‌సభ నేతగా బాధ్యతలు అప్పగించారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తిరిగి వచ్చేవరకు ఆయన స్థానంలో అభిషేక్ బెనర్జీ కొనసాగనున్నారు.