
Kerala: ఉపరాష్ట్రపతి నామినేషన్‌లో ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసిన కేరళ అభ్యర్థి
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మోసం బయటపడింది. ఈ ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనున్న నేపథ్యంలో,కేరళకు చెందిన జోయిమోన్ జోసెఫ్ అనే అభ్యర్థి పలువురు ఎంపీల పేర్లు,సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్ దాఖలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తక్షణమే తిరస్కరించారు. సమాచారం ప్రకారం,జోసెఫ్ సమర్పించిన పత్రాల్లో 22 మంది ప్రతిపాదకులు,22 మంది మద్దతుదారులుగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల పేర్లు, సంతకాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా,సంజయ్ సింగ్, అసదుద్దీన్ ఒవైసీ,హర్షిమ్రత్ కౌర్ బాదల్,సస్మిత్ పాత్ర,స్వాతి మాలివాల్,అలాగే ప్రస్తుతం జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు కూడా ఉందని అధికారులు గుర్తించారు.
వివరాలు
ఇద్దరి నామినేషన్లే సరైనవి
ఎన్నికల అధికారులు ఎంపీలను సంప్రదించి,జోసెఫ్‌కు మద్దతు ఇచ్చారా అని ప్రశ్నించారు. అయితే చాలామంది ఎంపీలు "జోసెఫ్ ఎవరో మాకు తెలియదని తాము సంతకం చేయలేదు" అని స్పష్టం చేయడంతో అసలు నిజం బయటపడింది. దీంతో ఆయన నామినేషన్ రద్దు చేసినట్లు న్యూస్18 తెలిపింది.ఆగస్టు 21 చివరి తేదీ వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు 46 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 68 నామినేషన్లు అందాయి. వాటిలో ప్రాథమిక పరిశీలనలోనే 19మంది అభ్యర్థుల 28 నామినేషన్లు తిరస్కరించారు. మిగతా 27 మంది అభ్యర్థుల 40 నామినేషన్లను పరిశీలించగా,కేవలం ఇద్దరి నామినేషన్లే సరైనవిగా తేలాయి. అవి.. ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్,ఇండియా కూటమి తరఫున బి సుదర్శన్ రెడ్డి. ఇద్దరూ నాలుగేసి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
వివరాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజున జగదీప్ ధన్‌కర్ రాజీనామా
జోయిమోన్ జోసెఫ్ నామినేషన్‌లో నకిలీ సంతకాల వ్యవహారంపై రాజ్యసభ కార్యదర్శికి సమాచారం అందజేయగా, ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అక్కడ నిర్ణయించనున్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్, సుదర్శన్ రెడ్డి మధ్య నేరుగా పోటీ జరగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజునే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యింది.