Page Loader
Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించే అవకాశం 
నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించే అవకాశం

Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించే అవకాశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2024
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటన ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. ఈ ఘోర ఘటన జరిగి నెల గడిచినా, న్యాయం జరగలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. వైద్యుల ఆగ్రహంతో పాటు, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటంతో కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20న కోర్టు సీబీఐకి ఈ కేసు దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సీబీఐ ఈరోజు సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టును సమర్పించనుంది.

వివరాలు 

న్యాయం చేయాలంటూ నిరసన 

నెల రోజులుగా కోల్‌కతా ప్రజలు, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు, డాక్టర్లు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శ్యాంబజార్ ప్రాంతంలో ప్రజలు నినాదాలతో నిరసన తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా కోల్‌కతాలో సామాన్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లోనూ ప్రజలు ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. సావిత్రి మార్కెట్‌ నుంచి షేర్‌ మార్కెట్‌ వరకు క్యాండిల్ మార్చ్‌ చేపట్టారు.

వివరాలు 

వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆదేశాలు 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయన కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను మార్చాలన్న ప్రజల డిమాండ్‌ను కూడా గుర్తుచేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, ప్రభుత్వం ఆందోళనకు స్పందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ కేసుకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేటికీ నెల రోజులు దాటింది. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది, ప్రజలంతా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.