LOADING...
Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ
కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ

Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాకు చెందిన కరడుగట్టిన దొంగల ముఠా ఓ కారు ద్వారా సరిహద్దు దాటి ప్రవేశిస్తుందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా కుప్పం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో ముఠా సభ్యులు పోలీసులపైకి కారును ఎక్కించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగలను అడ్డుకునేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

వివరాలు 

పూర్తి వివరాల్లోకి వెళితే… 

కుప్పం మీదుగా హరియాణా దొంగల ముఠా సరిహద్దు దాటుతున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో డీఎస్పీ పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ మల్లేష్‌ యాదవ్‌ నేతృత్వంలో పోలీసులు కృష్ణగిరి - పలమనేరు జాతీయ రహదారిపై తంబిగానిపల్లె చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీ ప్రారంభించారు. మంగళవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో, తమిళనాడులోని కృష్ణగిరి వైపుకు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్‌ నెంబర్ కలిగిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపారు. వాహనాన్ని పరిశీలించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు ముందుకు వెళ్లిన సమయంలో,ముఠా సభ్యులు సడెన్‌గా కారును రివర్స్‌లో నడిపి వారిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానిస్టేబుళ్లు వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.

వివరాలు 

వాహనంతో పారిపోయిన దుండగులు 

వీరు దొంగల ముఠాగా నిర్ధారణకు వచ్చిన అనంతరం, సీఐ మల్లేష్‌ యాదవ్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో డ్రైవర్‌ తొడను లక్ష్యంగా చేసుకొని ఒక్క రౌండ్‌ కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత దుండగులు స్కార్పియో కారుతో వేగంగా అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే పలువురు పోలీసులు బృందాలుగా ఏర్పడి వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వాహనం ఇంకా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును దాటలేదు కనుక, కుప్పం పురపాలక పరిధిలోని పలార్లపల్లె, పరమసముద్రం, బేవనపల్లె, వడ్డిపల్లె, గోనుగూరు, వెండుగంపల్లె వంటి ప్రాంతాల్లో కూంబింగ్‌ చేపట్టారు. ఈ గాలింపు సందర్భంగా పరమసముద్రం చెరువు సమీపంలో దుండగులు వాహనాన్ని వదిలి పరారయ్యారు.

వివరాలు 

హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు 

కాల్పుల్లో కారు డ్రైవర్‌కు గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా హరియాణాకు చెందినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వీరు దేశంలోని పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డట్లు సమాచారం. వాహనంలో మొత్తం ఐదుగురు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన కుప్పం డీఎస్పీ పార్థసారథి, పోలీసులపై దాడికి యత్నించినందుకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించామని చెప్పారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.