LOADING...
vamanrao couple murder case: వామన్‌రావు దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పజెపుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు 
వామన్‌రావు దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పజెపుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు

vamanrao couple murder case: వామన్‌రావు దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పజెపుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో ఈ దారుణ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పుట్టా మధూకర్‌ పేరును తెలంగాణ పోలీసులు అభియోగపత్రంలో చేర్చకుండా దర్యాప్తు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, నిష్పాక్షిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలంటూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్‌ ఎం.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం దీర్ఘకాలిక విచారణ అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

2021 సెప్టెంబరు 18న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌

ఇంతకుముందు కిషన్‌రావు హైకోర్టులో కూడా పిటిషన్‌ వేశారు. అయితే, 2021 మే 19న దర్యాప్తు అధికారి పూర్తి ఛార్జీషీట్‌ దాఖలు చేశారని, అందువల్ల మరలా దర్యాప్తు ఆదేశించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ 2021 సెప్టెంబరు 18న సుప్రీంకోర్టులో ఆయన రివ్యూ పిటిషన్‌ వేశారు. 2022 సెప్టెంబరు నుంచి పలు సార్లు విచారణ జరిగింది. చివరగా ఈ ఏడాది మే 13న సుప్రీం ధర్మాసనం వాదనలు వినింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున వాదన వినిపించిన న్యాయవాదులు, వామన్‌రావు తన మరణానికి ముందు ఇచ్చిన వీడియో వాంగ్మూలంలో పుట్టా మధూకర్‌ పేరు స్పష్టంగా ఉన్నదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

వివరాలు 

 ఆగస్టు 12కు విచారణ వాయిదా 

దీనిపై కోర్టు, ఆ వీడియోను పరిశీలించి సంబంధిత రికార్డులు సమర్పించాలని,వీడియోలో మధూకర్‌ పేరు లేకుంటే ఆ విషయం మీద అఫిడవిట్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఆగస్టు 12కు విచారణ వాయిదా పడింది. తాజా విచారణలో రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాది వైభవ్‌ హాజరై, వీడియో పరిశీలనలో నిజంగానే మధూకర్‌ పేరు వినిపించిందని ధర్మాసనానికి తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించడానికీ, సరికొత్త దర్యాప్తు ఆదేశించడానికీ రాష్ట్రానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కూడా సీబీఐ దర్యాప్తుకు ఏకీభవిస్తున్నారని కోర్టుకు వివరించారు.

వివరాలు 

నిందితుల తరఫు వాదనలపై కోర్టు స్పందన 

నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి,అలాగే పుట్టా మధూకర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదిస్తూ,హైకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని,ఛార్జీషీట్‌ దాఖలు చేసేందుకు అనుమతి కూడా హైకోర్టే ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే పిటిషనర్‌ సుప్రీంకోర్టుకు వచ్చారని,గత దర్యాప్తులో లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని వాదించారు. అయితే,ఈ వాదనలతో జస్టిస్‌ సుందరేష్‌ ఏకీభవించలేదు.''మీ వాదనలు వినేశాం.మీరు కోరుకుంటే దర్యాప్తు సీబీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరి చేత జరగాలో చెప్పండి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున, సీబీఐ దర్యాప్తే మీకు మేలు చేయగలదు'' అని వ్యాఖ్యానించి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

'హత్య వెనుక నిజాలు వెలుగులోకి రావాలి':మంత్రి శ్రీధర్‌బాబు 

అలాగే,పాత నిందితులను తిరిగి అరెస్ట్‌ చేయకూడదని,కానీ కొత్తగా ఎవరినైనా నిందితుల జాబితాలో చేరిస్తే వారిని అరెస్ట్‌ చేయడంలో ఈ ఆదేశాలు అడ్డంకి కాబోవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ,వామన్‌రావు దంపతుల హత్యసమయంలో అప్పటి ప్రభుత్వం బాధిత కుటుంబంపై సానుభూతి చూపలేదని, నిష్పాక్షిక విచారణ జరిపే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లోనే ఈ కేసు సీబీఐకి వెళ్లాలని డిమాండ్‌ చేసిందని గుర్తుచేశారు.సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగితే అసలు నేరస్తులు బయటపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాళేశ్వరంకమిషన్‌ నివేదిక నేపథ్యంలో అరెస్టులు జరుగుతాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, అరెస్టులకు ఏడాదిన్నర వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.

వివరాలు 

'మాకు న్యాయం దొరకనుందనే నమ్మకం': వామన్‌రావు తండ్రి 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో మీడియాతో మాట్లాడిన గట్టు కిషన్‌రావు, సుప్రీంకోర్టు సీబీఐకి దర్యాప్తు అప్పగించడంతో తమ కుటుంబానికి న్యాయం దొరకనుందనే నమ్మకం కలిగిందని అన్నారు. ''నా కుమారుడు, కోడలిని నడిరోడ్డుపై కిరాయి గుండాలు పగటిపూటనే దారుణంగా నరికి చంపారు. అప్పటి ప్రభుత్వం ఏ సహాయం చేయకపోవడంతో మేము న్యాయం కోల్పోయాం. అసెంబ్లీలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, మేము వెళ్లినప్పుడు పోలీస్‌ గేటు కూడా తెరవలేదు'' అని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు సహకారం అందిస్తున్నారని తెలిపారు.