ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. షాపురా భిటోని స్టేషన్‌లోని భారత్ పెట్రోలియం డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే, ఎల్పీజీ ఆయిల్ ట్యాంకర్లను ఖాళీ చేసేందుకు వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి రెండు వ్యాగన్ల రేకులు పట్టాలు తప్పాయి.
రైలు పట్టాలు తప్పిన వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్, గూడ్స్ రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. హుటాహుటిన సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ప్రమాద సహాయక వాహనంతో అర్థరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పట్టాలు తప్పిన బోగీలను తొలగించేందుకు బుధవారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Indian Railways Faces Series Rail Accidents
భారత రైళ్లకు గడ్డుకాలం
ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడం మొత్తం రైల్వే వ్యవస్థలో ఏం జరుగుతుందో అనే ఆలోచనను మరోసారి దేశవ్యాప్తంగా రేకెత్తిస్తోంది.
ఈ ప్రమాదం రైల్వే వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. రైల్వే అధికారులు, యంత్రాంగం మరెంతో సమర్థంగా రైలు నిర్వహణ చేయాల్సిన ఆవశ్యకతను ఇలాంటి ప్రమాదాలు గుర్తుచేస్తున్నాయి.
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న భారీ ప్రమాదంలో భారత రైల్వే వ్యవస్థకు ఊహించని రీతిలో నష్టం సంభవించింది.
వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. దీని ప్రభావం భారత్ లోని ఇతర రాష్ట్రాలపై ప్రత్యక్షంగా కనిపించింది. ఈ ఘటన మిగిల్చిన విషాదఛాయలను మరువకముందే రోజుకో రైలు ప్రమాదం జరుగుతూనే ఉంది.
Indian Railways Faces Series Rail Accidents
వరుస ప్రమాదాల్లో ఇండియన్ రైల్వేస్
సికింద్రాబాద్ అగర్తలా రైలులోని ఓ ఏసీ భోగిలో మంటలు చేలరేగిన ఘటన ఇందుకు ఉదాహరణ. అంతేనా ఒడిశాలోనే బొగ్గు తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
జార్ఖండ్ లో మరో భారీ రైలు ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి న్యూఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో, రైల్వే గేట్‌ను ఓ ట్రాక్టర్ ఢీకొట్టి గేటులోనే ఇరుక్కుపోయింది. గమనించిన లోకో పైలెట్ సడెన్ బ్రేకులు వేయడంతో రైలు ఆగి మరో డేంజర్ తప్పింది.
మరో వైపు బెంగళూరు ఎక్స్ ప్రెస్ కూ పెను ప్రమాదం తప్పినట్టైంది. మంగళవారం రాత్రి కాచిగూడ నుంచి బెంగళూరుకు బయల్దేరిన రైలు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి.