Page Loader
Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన

Air india Flight Crash: 'చాలా మంది ప్రయాణికులు మరణించారు'.. : విదేశాంగ శాఖ ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే . ఈ విషాదకర ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

వివరాలు 

అప్‌డేట్‌ను సంబంధిత శాఖలతో పంచుకుంటాం: రణ్‌ధీర్ జైస్వాల్

ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ— ''అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన మాటల్లో చెప్పలేనిది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, చాలా మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులకు మా గాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరణించిన వారిలో ఎక్కువ మంది విదేశీయులే. సంఘటనా స్థలంలో సహాయ చర్యలు శరవేగంగా సాగుతున్నాయి'' అని తెలిపారు. ప్రతి అప్‌డేట్‌ను సంబంధిత శాఖలతో పంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రాణ నష్టంపై ఈ దశలో ఖచ్చితమైన సంఖ్యను చెప్పడం సాధ్యం కాదని, పూర్తి సమాచారం అందేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

వివరాలు 

169 మంది భారతీయులు

ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రస్తుతం సంఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.