
#NewsBytesExplainer: మాక్ డ్రిల్ అంటే ఏమిటి? దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
మే 7న దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ చర్యలు పాకిస్థాన్‌తో యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని చేపట్టినవేనని కేంద్ర ప్రభుత్వానికి సమీప వర్గాలు వెల్లడించాయి.
గతంలో 1971లో భారత్ - పాకిస్థాన్ యుద్ధం సమయంలో కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించినట్టు తెలియజేశారు.
ఇప్పుడు 54ఏళ్ల తర్వాత మరోసారి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయనేది ఒకవైపు ప్రశ్నగా ఉన్నప్పటికీ, అసలైన ప్రశ్న ఏమిటంటే మాక్ డ్రిల్స్ అంటే ఏం చేస్తారు?
వివరాలు
శత్రు విమానాలు లక్ష్యం కాకుండా ఉండాలంటే..
భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితి తలెత్తినపుడు, ముఖ్యంగా విమాన దాడుల ప్రమాదం ఉన్న సమయంలో, హెచ్చరికగా గట్టిగా వినిపించే సైరన్లు మోగిస్తారు.
ఆ సమయంలో ప్రజలంతా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు,అండర్లాండ్స్ లేదా బంకర్లకు చేరవలసి ఉంటుంది.
విద్యుత్ లైట్లు ఆపడం ద్వారా శత్రు విమానాలు లక్ష్యంగా గుర్తించకుండా నివారించవచ్చు.
సివిలియన్లు, విద్యార్థులకు యుద్ధ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? అనే విషయాల్లో మాక్ డ్రిల్స్ ద్వారా శిక్షణ ఇస్తారు.
ఇది స్కూలులు, కాలనీలు, కార్యాలయాల వంటి ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాల రూపంలో జరుగుతుంది.
వివరాలు
ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల బ్లాక్‌అవుట్ మాక్ డ్రిల్
అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి? సమీపంలోని సురక్షిత ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ఎలా కాపాడుకోవాలి? వారికి ఎలా చేరుకోవాలి? వంటి అంశాలపై కూడా స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ డ్రిల్స్ ఉపయోగపడతాయి.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ టవర్లు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేయడం, విత్ డ్రాయల్ ప్లాన్లను అప్‌డేట్ చేయడం, దాడుల సమయంలో ఏ దిశగా కదలాలన్న అంశాల్లో కూడా సాధన జరుగుతుంది.
మే 4న పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల బ్లాక్‌అవుట్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఇది మే 7న దేశవ్యాప్తంగా జరుగనున్న డ్రిల్స్‌కు ముందస్తు సంకేతంగా సాగింది.
వివరాలు
దేశ రక్షణ విధానంలో వ్యూహాత్మక మార్పుకు సూచన
ఈ డ్రిల్లుల్లో సివిల్ డిఫెన్స్ వార్డెన్లు,హోం గార్డ్స్, ఎన్‌సీసీ (NCC),ఎన్‌ఎస్‌ఎస్ (NSS),నెహ్రూ యువ కేంద్రమ్ సభ్యులు (NYKS), విద్యార్థులు, స్థానిక అధికారులు సహా అనేక మంది పాల్గొంటారు.
ఈ డ్రిల్లులు పౌర రక్షణ వ్యవస్థలో సాధారణ ప్రజల పాత్రను కలుపుతూ దేశ రక్షణ విధానంలో వ్యూహాత్మక మార్పుకు సూచనగా నిలుస్తున్నాయి.
అధికారుల ప్రకారం,ఈ మాక్ డ్రిల్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇది యుద్ధం వచ్చినపుడు మనం ఎలా స్పందించాలో ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు.
వివరాలు
మాక్ డ్రిల్ లో అందరూ తప్పకుండా పాల్గొవాలి
తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో విశాఖపట్టణం జిల్లాలో, తెలంగాణలో హైదరాబాద్‌లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి.
అలాగే కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం వంటి రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పెద్దఎత్తున డ్రిల్స్ నిర్వహించనున్నారు.
మీ ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తే 'మనకు దీన్ని అవసరమేంటి' అని నిర్లక్ష్యం చేయకుండా అందులో తప్పకుండా పాల్గొనాలి.
ఎందుకంటే ఇవి భవిష్యత్తులో మీ ప్రాణాలను కాపాడేలా ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాక్ డ్రిల్లులను గంభీరంగా తీసుకోవాలి.