Page Loader
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం 
పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం

PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పరిధిలోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన భయంకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని తక్షణమే భారత్‌కి చేరుకున్నారు. అయితే, తిరుగు పయనంలో ఆయన ప్రయాణించిన విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. ఇది ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో కనిపించిన దృశ్యాల ద్వారా వెల్లడైంది. మంగళవారం ఉదయం ప్రధానమంత్రి మోదీ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం రియాద్‌ వెళ్లేటప్పుడు మాత్రం పాకిస్థాన్ గగనతలాన్ని దాటి ప్రయాణించింది. కానీ అనంతరం జరిగిన దాడి కారణంగా అప్రమత్తత చర్యగా తిరుగు ప్రయాణానికి పాక్ గగనతలాన్ని మళ్లీ ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

వివరాలు 

భద్రతా చర్యలపై ఆరా 

అరేబియా సముద్రం మీదుగా విమానం గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి,అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంది. పాకిస్థాన్ వైపు నుండి ముప్పు ఉండవచ్చన ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల కారణంగా ఈ మార్పు జరిగిందని సమాచారం. ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహించడంతోపాటు, భద్రతా చర్యలపై ఆరాతీశారు. అదే రోజు ప్రధానమంత్రి నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది.

వివరాలు 

విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు 

పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ, జమ్మూ కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన ప్రాంతం. అక్కడే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. వారు పర్యాటకుల చుట్టూ చేరి, చాలా దగ్గరగా ఉండగానే కాల్పులు ప్రారంభించారు. ఈ మృత్యుఘాటక ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం, ముష్కరులు సమీప అడవుల్లోకి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.