LOADING...
Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి
2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి

Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
07:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా జనగణన (Census) ఎప్పుడు జరుగుతుందోనన్న ఉత్కంఠకు త్వరలో తెర పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల కోసం సన్నద్ధమవుతుండగా, 2027 మార్చి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, ఈసారి కుల గణన (Caste Census) కూడా చేపట్టనున్నట్టు స్పష్టమైన సంకేతాలు లభించాయి.

వివరాలు 

రెండు దశల్లో లెక్కింపు ప్రక్రియ 

హిమాచల్ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, లద్దాఖ్ వంటి రాష్ట్రాలు, అలాగే ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 అక్టోబరులోనే లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈసారి జనగణనను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మహిళలు, పురుషులు మాత్రమే కాకుండా, వారి కులాలు, ఉపకులాల గురించి కూడా లెక్కలు తీసుకుంటారు. ఈ మహత్తర ప్రక్రియను కేంద్ర హోంశాఖకు చెందిన 'రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా' పర్యవేక్షించనుంది.

వివరాలు 

జనగణనలో విరామం - కోవిడ్ ప్రభావం 

సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహించడం పరిపాటి. చివరిసారిగా ఈ లెక్కలు 2011లో నిర్వహించబడ్డాయి. నిబంధనల ప్రకారం 2021లో ఇది జరగాల్సినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా లెక్కింపు వాయిదా పడింది. అప్పటి నుంచి ఎప్పటికి ఇది నిర్వహిస్తారన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే, 2024లో కేంద్ర హోంశంత్రి అమిత్ షా స్పందిస్తూ, సరైన సమయంలో తప్పకుండా జనాభా గణన నిర్వహిస్తామని ప్రకటించారు.

వివరాలు 

ప్రశ్నల లిస్టు సిద్ధం 

ఈ నేపథ్యంలో దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఈ గణనకు సంబంధించి 30కి పైగా ప్రశ్నలతో కూడిన ప్రాథమిక సర్వే ఫారమ్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది ప్రజల మూలభూత అవసరాలు, సామాజిక పరిస్థితులు, కులాల పంపిణీ వంటి అనేక అంశాలపై లోతైన సమాచారాన్ని ఇవ్వనుంది.