LOADING...
PM Modi: బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్‌ సిందూర్‌' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ 
బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్‌ సిందూర్‌' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ

PM Modi: బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్‌ సిందూర్‌' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
08:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 'ఆపరేషన్‌ సిందూర్‌' విజయవంతం కావడం, సైనికుల ధైర్య సాహసాలు, శక్తి ప్రదర్శన దేశ ప్రజల గర్వకారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత, సంకల్పశక్తి ఫలితంగా ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నామని ప్రధాని స్పష్టం చేశారు. లోక్‌సభలో ఈ ఆపరేషన్‌పై జరిగిన చర్చకు సమాధానంగా ఆయన ప్రసంగించారు. కాల్పుల విరమణలో అమెరికా పాత్రను మరోసారి తోసిపుచ్చిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌, విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వివరాలు 

ఆపరేషన్‌ సిందూర్‌ ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు! 

ప్రపంచంలోని ఏ నేత కూడా 'ఆపరేషన్‌ సిందూర్‌'ను నిలిపేయమని సూచించలేదని ప్రధాని పేర్కొన్నారు. మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఫోన్‌ ద్వారా తనతో మాట్లాడారని తెలిపారు. పాకిస్థాన్‌ పెద్ద ఎత్తున దాడులకు యత్నిస్తోందన్న హెచ్చరిక అందినప్పటికీ, తాము ఏమాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పారు. పాకిస్థాన్‌ ఎలా దాడి చేసినా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని స్పష్టం చేశారు. "బుల్లెట్‌కి బుల్లెట్‌తోనే స్పందిస్తాం" అని వాన్స్‌కు స్పష్టంగా చెప్పారు. పాక్‌కు ఎవరు సహాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశామని తెలిపారు. చివరికి పాకిస్థాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అర్ధరాత్రి కాల్‌ చేసి దాడులు ఆపాలని కోరిన తర్వాతే ఆపరేషన్‌ నిలిపివేశామని మోదీ వివరించారు.

వివరాలు 

ఆపరేషన్‌ సిందూర్‌కు 190 దేశాల మద్దతు 

పహల్గాం ఉగ్రదాడుల వెనక మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాలన్న ఉద్దేశం ఉందని మోదీ ఆరోపించారు. దాడి అనంతరం దేశం ఉగ్రవాదానికి తగిన గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయమై చర్చ జరిపినట్లు గుర్తు చేశారు. పాక్‌ భూభాగంలోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పాక్‌ విమాన స్థావరాలు ఇప్పటికీ విలవిలలాడుతున్నాయని పేర్కొన్నారు. అణ్వాయుధాలతో బెదిరింపులు చేసి తమను ఆపలేరని స్పష్టం చేశారు. ప్రపంచంలోని 193 దేశాల్లో 190 దేశాలు భారత చర్యలకు మద్దతుగా నిలిచాయని చెప్పారు. కేవలం మూడే దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.

వివరాలు 

పాక్‌ను కాంగ్రెస్‌ వెనకేసుకురావడం దౌర్భాగ్యం 

'ఆపరేషన్‌ సిందూర్‌' విషయంలో కాంగ్రెస్‌ విమర్శలు చేయడం బాధాకరమని మోదీ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సైనికుల సాహసాన్ని తక్కువ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ఆరోపణలతో సైనికుల మనోబలాన్ని దిగజారుస్తున్నారని మండిపడ్డారు. మీడియాలో హైలైట్స్‌ కావాలన్న ఉద్దేశంతో కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు మీడియా ప్రధాన కథనాల్లో కనిపించవచ్చేమో గానీ ప్రజల మన్నన పొందలేరని వ్యాఖ్యానించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ సమయంలోనూ ఇదే తీరుతో వ్యవహరించారని గుర్తుచేశారు. పైలట్‌ అభినందన్‌ను తిరిగి తీసుకురావడంలోనూ ఇదే తరహా విమర్శలు వచ్చాయని అన్నారు. కానీ, ఆయన్ను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన ఘనత తమదేనని చెప్పారు.

వివరాలు 

పాక్‌ను కాంగ్రెస్‌ వెనకేసుకురావడం దౌర్భాగ్యం 

విపక్షాల విమర్శలపై దేశ ప్రజలు నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. భారత రక్షణ దళాల శక్తి, సామర్థ్యాలపై తనకు పూర్తి నమ్మకముందని, వారికి అవసరమైన స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించిందని వెల్లడించారు. భారత ప్రజల భావోద్వేగాలతో తన గొంతు కలిపి ముందుకు సాగుతున్నానని అన్నారు. ఆపరేషన్‌ సమయంలో తనపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

పాక్‌.. మళ్లీ దుశ్చర్యలకు పాల్పడితే: మోదీ వార్నింగ్‌ 

పాకిస్థాన్‌ మళ్లీ ఏవైనా కుట్రలకు పాల్పడితే 'ఆపరేషన్‌ సిందూర్‌' మరింత తీవ్రమవుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదుల ప్రయత్నాలను తుపాకులతోనే సమాధానమిస్తామని స్పష్టం చేశారు. పహల్గాం దాడికి కారకులైన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. తదుపరి దశలో 'ఆపరేషన్‌ మహాదేవ్‌' ప్రారంభించి ఉగ్ర మూలాలను తొలగిస్తున్నామని వివరించారు.