LOADING...
Jagdeep Dhankhar: జగదీప్ ధన్కర్ కు విపక్షాల వీడ్కోలు విందు..!
జగదీప్ ధన్కర్ కు విపక్షాల వీడ్కోలు విందు..!

Jagdeep Dhankhar: జగదీప్ ధన్కర్ కు విపక్షాల వీడ్కోలు విందు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప రాష్ట్రపతిగా ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలిఉన్నా, జగదీప్ ధన్కర్ హఠాత్తుగా రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఆయనకు అధికారికంగా వీడ్కోలు చెప్పేందుకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు కేంద్రాన్ని అభ్యర్థించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. దాంతో, ఆయన్ను గౌరవించేందుకు విపక్షాలే స్వయంగా వీడ్కోలు విందుకు ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమానికి ధన్‌ఖడ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలిసింది. రాజీనామాకు ఆరోగ్య సమస్యలే కారణమని ధన్‌ఖడ్ ప్రకటించినా,ఈ ప్రకటనపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

వివరాలు 

ధన్‌ఖడ్‌కు అధికారిక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించాలని..  జైరామ్ రమేష్ డిమాండ్ 

ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించగా,కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ధన్‌ఖడ్‌కు వీడ్కోలు విందు ఇవ్వాలని కోరినా,కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై వార్తలు వచ్చాయి. ధన్‌ఖడ్‌కు అధికారిక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు. కానీ,కేంద్రం ఈ అంశంపై స్పందించలేదు.మంత్రులు కిరణ్ రిజిజు,జేపీ నడ్డా వంటి కీలక నేతలు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేంద్రం చూపుతోన్న ఈ నిశ్శబ్ద వైఖరి విపక్షాల అనుమానాలను మరింత బలపరుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే,విపక్షాల ఆహ్వానాన్ని ధన్‌ఖడ్ అంగీకరించకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వివరాలు 

 త్వరలో అధికారిక నివాసాన్ని ఖాళీ  చేయనున్న  ధన్‌ఖడ్ 

ఇక మరోవైపు, ధన్‌ఖడ్ తన అధికారిక నివాసాన్ని త్వరలో ఖాళీ చేయనున్నట్లు సమాచారం. మంగళవారం నుంచే ఆయన వ్యక్తిగత వస్తువుల బండిళ్లు ప్యాక్ చేసే పనిని ప్రారంభించినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో ధన్‌ఖడ్ పార్లమెంటు హౌస్ సమీపంలోని చర్చ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌కు మారారు. ఉప రాష్ట్రపతి నివాసం,కార్యాలయంగా వినియోగించే ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టు కింద నిర్మించింది. గత 15 నెలలుగా ధన్‌ఖడ్ అదే నివాసంలో ఉంటున్నారు.