ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ
కొత్త పార్లమెంట్ భవనం 'సెంట్రల్ విస్టా' ప్రారంభంపై రాజకీయ రగడ రాజుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంట్ భవనం ప్రారంభ తేదీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మే 28వ తేదీన 'సెంట్రల్ విస్టా'ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అదే తేదీన బీజేపీ మార్గనిర్దేశకుడైన సావర్కర్ జయంతి కావడం గమనార్హం. అందుకే ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై కూడా రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాని కాకుండా రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి సెంట్రల్ విస్టాను ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
జాతీయ నేతలను అవమానించడమే: కాంగ్రెస్
సావర్కర్ జయంతి రోజున కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం అంటే, దేశం కోసం పోరాడిన జాతీయ నేతలను అవమానించడమేనని కాంగ్రెస్ పేర్కొంది. అయితే కాంగ్రెస్ వాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఏదీ లేని చోట వివాదాలు రేకెత్తించడం కాంగ్రెస్‌కు అలవాటేనని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి దేశాధినేత అయితే, పీఎం ప్రభుత్వాధినేత, ప్రభుత్వం తరపున పార్లమెంటుకు నాయకత్వం వహిస్తారని చెప్పారు. ప్రధాని ఏ సభలోనైనా సభ్యుడిగా ఉంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని పనికిరాని పార్టీగా బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అభివర్ణించారు. సావర్కర్ కాళ్ళపై ఉన్న దుమ్ముకు ఉన్నంత విలువ ఆయన పుట్టిన తేదీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారికి లేదని చేప్పారు.
రాష్ట్రపతిని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతిని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా ప్రభుత్వం పదే పదే బాధ్యతలను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కొత్త పార్లమెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించలేదని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించడం లేదని ఖర్గే ట్వీట్ చేశారు. దేశంలో రాష్ట్రపతి మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రతి పౌరునికి ప్రాతినిధ్యం వహిస్తారని, ఆమె భారతదేశపు మొదటి పౌరురాలని ఖర్గే గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔచిత్యానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని ఖర్గే తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఉమ్మడి సమావేశానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఇతర ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి. మోదీజీ సెల్ఫ్ ఇమేజ్, కెమెరాల పట్ల మోజు వల్ల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని సీబీఐ నేత రాజా అన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని కార్యనిర్వాహక అధిపతి మాత్రమే, శాసనసభ కాదన్నారు ఒవైసీ. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పారు. ఇది ప్రజల సొమ్ముతో నిర్మించారని, కానీ ప్రధాని మోదీ అలా అనుకోవడం లేదన్నారు. తన స్నేహితులు స్పాన్సర్ చేస్తే పార్లమెంట్ భవనాన్ని నిర్మించినట్లు మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రారంభోత్సవంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.