Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన గంటలోనే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. తొలుత, ఇటీవల మరణించిన సభ్యులకు సభలో ఎంపీలు సంతాపం ప్రకటించారు. అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయబడింది. అదే సమయంలో, రాజ్యసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులు, అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావించారు. అదానీ అవినీతి దేశానికి తీవ్ర ప్రభావం చూపిస్తోందని, ఈ అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతనికి మద్దతు ఇచ్చినట్టు ఆరోపించారు. కానీ, అదానీ అంశంపై చర్చ చేపట్టేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ నిరాకరించడంతో విపక్ష సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.ఈ కారణంగా రాజ్యసభ కూడా బుధవారానికి వాయిదా పడింది.
నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా
లోక్‌సభ బుధవారానికి వాయిదా
తదుపరి, వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలోనూ ఇండియా కూటమి సభ్యులు అదానీ అవినీతి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దాంతో, స్పీకర్ ఓం బిర్లా కూడా సభను బుధవారానికి వాయిదా వేశారు. ఈ పరిణామాలతో ఉభయ సభల్లో అదానీ అవినీతి అంశం ప్రధాన చర్చాంశంగా మారింది. విపక్ష సభ్యులు ఈ విషయంపై చర్చ అనివార్యమని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన గంటలోనే గందరగోళం ఏర్పడి వాయిదా పడింది.