
Modi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్ట్రైక్స్ పై చర్చ జరిగింది.
ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ దాడులపై మంత్రులకు పూర్తి సమాచారం అందించారు.
"ఇది దేశప్రజలందరికీ గర్వించదగ్గ విషయం" అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం.
భారత భద్రతా దళాలు నిర్వహించిన ఈ కచ్చితమైన ప్రతీకార చర్యను 'ఆపరేషన్ సిందూర్'గా అభివర్ణించినట్టు తెలుస్తోంది.
వివరాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని మోదీ
ఈ ఆపరేషన్ సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (పీఓకే) ఐదు ఉగ్రవాద శిబిరాలు,పాకిస్థాన్ భూభాగంలో మరో నాలుగు శిబిరాలపై ఎలా దాడులు నిర్వహించారన్న విషయాన్ని ప్రధాని మోదీ మంత్రివర్గ సభ్యులకు వివరించారు.
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రజల్లో ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అలాంటి సున్నిత పరిస్థితుల్లో ప్రధాని మోదీ దేశాన్ని నిశ్చలంగా నడిపిన తీరును కేబినెట్ సభ్యులు కొనియాడినట్టు సమాచారం.
ఈ కేబినెట్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం వీరిద్దరూ తొలిసారి భేటీ కావడం విశేషం. అందుకే ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
వివరాలు
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు
ఇదిలా ఉండగా, ఆపరేషన్ సిందూర్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించిన విషయం తెలిసిందే.
ఈ దాడుల తర్వాత భారతీయ ఉన్నతాధికారులు వివిధ దేశాలకు ఈ ఆపరేషన్ వివరాలు అందించారు.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు అమెరికా, రష్యా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చారు.
వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ఈ మెరుపుదాడులపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పాక్‌లోని సాధారణ పౌరులు, ఆర్థిక కేంద్రాలు లేదా సైనిక స్థావరాలపై దాడి జరగలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ కార్యదర్శితో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం.