
Modi on Tariffs: ట్రంప్ టారిఫ్‌లు.. నేడు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్‌పై సుంకాలను రెండింతలు చేసే నిర్ణయం అమెరికా తీసుకోవడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈటారిఫ్‌ల అంశంపై న్యూఢిల్లీతో చర్చలకు అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు. ఈపరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ విధించిన టారిఫ్‌లపై భారత్ తీసుకోబోయే ప్రతిస్పందనపై ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ సమావేశం అనంతరం సుంకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.
వివరాలు
రాజీపడే ప్రసక్తే లేదు..
ఇప్పటికే ట్రంప్ సుంకాలపై మోదీ పరోక్షంగా స్పందిస్తూ దీటైన సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారుల వంటి వర్గాల ప్రయోజనాలే తమకు ప్రధానమని, ఈ విషయంలో ఎటువంటి రాజీకి తావులేదని ప్రధాని స్పష్టం చేశారు. అవసరమైతే వారిని రక్షించేందుకు ఎంతటి మూల్యమైనా తాను స్వయంగా భరించడానికి సిద్ధమని వెల్లడించారు. ఇదిలా ఉండగా, రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని ట్రంప్ మళ్లీ హెచ్చరించడం గమనార్హం.