
Pm Modi: ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్, మహదేవ్'లది కీలక పాత్ర.. లోక్‌సభలో అమిత్ షా ప్రసంగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంగా హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఆపరేషన్ మహదేవ్, ఆపరేషన్ సిందూర్ వంటి ఆపరేషన్లు ఎంతగానో కీలకమని ఆయన స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్లకు సంబంధించి హోంమంత్రి ఎంతో విస్తృతంగా వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమిత్ షా తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారని మోదీ ట్వీట్‌లో తెలిపారు.
వివరాలు
నెహ్రూ నిర్ణయాలను వ్యతిరేకించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్
అంతకుముందు, లోక్‌సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. భారతదేశ అభివృద్ధి జరగకపోవడానికి, అలాగే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ఇంకా ఉనికిలో ఉండడానికి ప్రధాన కారణం నెహ్రూనే అని ఆరోపించారు. 1948లో భారత సైన్యం పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునే సమీపంలో ఉన్నప్పటికీ, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించడం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయామని చెప్పారు. నెహ్రూ నిర్ణయాలను సర్దార్ వల్లభభాయ్ పటేల్ కూడా వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.
వివరాలు
యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత స్థానం కోసం నిరంతరంగా కృషి
అలాగే,1971లో తూర్పు పాకిస్థాన్ విమోచన యుద్ధం సమయంలోనూ పీవోకేను భారత్‌లో కలుపుకునే అవకాశాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేజార్చిందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేకాకుండా,ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో(UNSC)భారతదేశానికి శాశ్వత సభ్యత్వం దక్కకపోవడానికి కూడా నెహ్రూనే కారణమని దుయ్యబట్టారు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వలనే భారత్‌కు ఇంకా ఆస్థానం లభించలేదని విమర్శించారు. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత స్థానం కోసం నిరంతరంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. దేశంపై ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్న సందర్భాల్లో ప్రశాంతంగా కూర్చునే ప్రభుత్వం ఇది కాదని,గతంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తరహాలో వ్యవహరించదని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశ భద్రతను ప్రధాన్యంగా తీసుకుంటుందని అమిత్ షా ఉద్ఘాటించారు.