Page Loader
PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన

PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న జమ్ముకశ్మీర్‌ను సందర్శించనున్నారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత మోదీ మొదటిసారిగా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించబోతున్నారు. ఆయన ఈ సందర్భంగా శ్రీనగర్‌కు వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. మొదటగా ఈ రైలు ప్రారంభోత్సవం ఏప్రిల్ 19న జరగాల్సి ఉండగా, అప్పటి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈలోగా ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఘోర ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" పేరుతో ప్రతీకార చర్యలు ప్రారంభించింది.

వివరాలు 

భద్రతా వ్యవస్థ పూర్తిగా కట్టుదిట్టం

జూన్ 6న మోదీ పర్యటనలో భాగంగా చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు. దీనితో పాటు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు నడిచే ప్రత్యేక వందే భారత్ "కాశ్మీర్ ఎడిషన్" రైలును కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారాయన. ఈ కార్యక్రమ వేదికపై మోదీ ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని భద్రతా వ్యవస్థను పూర్తిగా కట్టుదిట్టం చేశారు.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతం 

ఇక ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్ మద్దతుతో జరిగిన దాడుల్లో దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు కఠిన చర్యలు తీసుకుంది. వాటిలో ముఖ్యంగా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేయడం, పాకిస్థాన్‌కు ఇచ్చిన వీసాలను రద్దు చేయడం, అటారీ సరిహద్దును మూసివేయడం ఉన్నాయి. మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమవ్వగా, పాకిస్థాన్ వైమానిక స్థావరాలకు తీవ్రంగా నష్టం జరిగింది.