అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. జూన్ 21-23వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక విందుకు ఆహ్వానించిన విషయం తెలిపిందే. దీంతో మొదటిసారిగా మోదీ అమెరికా అధ్యక్షుడి అధికారిక విందుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య రక్షణ, వాణిజ్యంతో పాటు కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరగనుంది. జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నాయకత్వం వహించనున్నారు. యోగా డే వేడుకలతో ప్రధాని మోదీ అమెరికా పర్యటన మొదలవుతుంది.
అమెరికాలో కాంగ్రెస్‌లో చారిత్రక ప్రసంగం
జూన్ 22న వాషింగ్టన్ డీసీలోని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌కు వెళ్లనున్నారు. అక్కడ మోదీకి బైడెన్ దంపతులు స్వాగతం పలకనున్నారు. అనంతరం అమెరికా కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగించనున్నారు. గతంలో కూడా మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించిన అతికొద్ది మంది విదేశీ నాయకుల జాబితాలో మోదీ చేరనున్నారు. అదేరోజు సాయంత్రం బైడెన్ దంపతులు ప్రధాని మోదీ గౌరవార్థం స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమెరికా అధికారిక పర్యటనకు వెళ్లిన మూడో భారతీయ నేత మోదీ. జూన్ 1963లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, నవంబర్ 2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా అధికారిక పర్యటకు హాజరయ్యారు.
ఆ ఘనత సాధించిన ప్రపంచంలోనే మూడో నేతగా మోదీ రికార్డు
ఏ భారత ప్రధాని కూడా అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించలేదని ఆ ఘనత మోదీకి దక్కబోతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా మాత్రమే అమరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించారు. ఇప్పుడు మూడో విదేశీ ప్రతినిధి మోదీ కాబోతున్నారు. ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు బైడైన్ అధికారిక విందును అందుకుంటున్న మూడో దేశాధిన మోదీ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, దక్షిణ కొరియాకు చెందిన యున్ సుక్ యోల్ మాత్రమే అమెరికా అధ్యక్షుడి అధికారిక విందును అందుకున్నారు.