
Rahul Gandhi: ఆ ఒక్క నియోజకవర్గంలోనే లక్ష నకిలీ ఓట్లు ఉన్నాయి: రాహుల్ గాంధీ ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాల్లో నకిలీ పేర్లు నమోదయ్యాయని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సూచించిన దానికంటే వాస్తవ ఫలితాలు భిన్నంగా రావడం పట్ల సందేహాలు వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తమ అనుమానాలను బలపరిచాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో గల అక్రమాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
వివరాలు
ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదు
మహారాష్ట్రలో జరిగిన ఓటర్ల నమోదు గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, గత ఐదేళ్లలో నమోదైన ఓటర్ల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల మధ్యకాలంలో మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. ఓటర్ల జాబితాను తమకు ఇవ్వాలని కోరినప్పటికీ, ఎన్నికల సంఘం అందించలేదని చెప్పారు. ఓటర్ల జాబితా దేశ సంపదగా పేర్కొంటూ, దాన్ని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
వివరాలు
మహదేవపుర నియోజకవర్గంలోలక్ష ఓట్లు నకిలీవి..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు తమ అనుమానాలను నిజం చేశాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా మిషన్ రీడబుల్ (machine-readable) రూపంలో ఇవ్వకపోవడం మరిన్ని సందేహాలకు దారితీస్తోందన్నారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో తమ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. ఆ నియోజకవర్గంలో మొత్తం 6.5 లక్షల ఓట్లలో లక్ష ఓట్లు నకిలీవిగా ఉండటం, వాటికి తప్పుడు చిరునామాలు నమోదు కావడం తేలిందని తెలిపారు.