
Heavy Rains: ఈ జిల్లాల్లో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రజలకు ఎండల ఉక్కపోత నుంచి ఉపశమనం. భారత వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది.
చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుసంధానంగా ద్రోణి ప్రభావం కూడా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల మీదుగా మరో ఆవర్తనం ఏర్పడింది.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో వానలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే సూచనలున్నాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Details
2 - 4 డిగ్రీల మేర తగ్గే ఉష్ణోగ్రతలు అవకాశం
ఇవాళ, రేపు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
శుక్ర, శనివారాల్లో రెండు రోజులు ఎల్లో అలర్ట్ అమల్లో ఉండనుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఈ వర్షాల ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 - 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిన్న 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల ప్రభావంతో ఈ ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.