LOADING...
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ముదురుతున్న వర్గ పోరు.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు
బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ముదురుతున్న వర్గ పోరు.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య విభేదాలు మరింత వేడెక్కుతున్నాయి. పార్టీని వీడి బీజేపీలో చేరతారన్న విమర్శలతో ఇరువురు వర్గాల మద్దతుదారులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేఎన్‌ రాజన్న బీజేపీలో చేరే అవకాశముందంటూ ఇటీవల ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. రాష్ట్ర సహకార మంత్రిగా రాజన్న గతంలో సేవలందించారు. అయితే రాహుల్ గాంధీపై ఓట్ల దోపిడీ ఆరోపణలు చేసిన తర్వాతే ఆయనను పదవి నుంచి తప్పించారన్న వాదనలు అప్పట్లో వినిపించాయి.

వివరాలు 

పరోక్షంగా డీకే శివకుమార్ ఉద్దేశిస్తూ రాజేంద్ర విమర్శలు

ఈ నేపథ్యంలో తన తండ్రి పార్టీ మారబోతున్నారని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు. నిజానికి బీజేపీలో చేరేది బాలకృష్ణేనని ప్రత్యారోపణలు చేశారు. సీఎం పదవి కోసం పోరాడుతున్న నేత (డీకే శివకుమార్) వెంట బాలకృష్ణ కూడా వెళ్లబోతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంలో డీకే శివకుమార్ పేరును స్పష్టంగా ప్రస్తావించకపోయినా, పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ రాజేంద్ర విమర్శలు గుప్పించారు. తన తండ్రిపై కుట్ర పన్నే ప్రయత్నం జరుగుతోందని, ఇందుకు కారణం వారు సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులుగా ఉండటమేనని రాజేంద్ర మండిపడ్డారు.

వివరాలు 

కాంగ్రెస్‌ను వీడే ప్రశ్నే లేదు: రాజన్న

రాజన్న మంత్రిత్వ పదవి కోల్పోవడానికి వెనక ఏదో రహస్య శక్తి పనిచేసిందని రాజేంద్ర ఆరోపించారు. ''కాంగ్రెస్‌ను వీడే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ వల్లే నాకు మంత్రిపదవి దక్కింది. చివరి వరకు నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను'' అని రాజన్న ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. అదేవిధంగా, అసెంబ్లీలో రాజన్న ఆరెస్సెస్ గీతం ఎప్పుడూ పాడలేదని, చిన్నప్పటి నుండి ఆరెస్సెస్ శాఖలతో ఆయనకు ఎలాంటి పరిచయం లేదని పేర్కొన్నారు. స్వతంత్ర భావజాలంతో ముందుకు సాగే వ్యక్తి రాజన్న అని ఆయనను ప్రశంసించారు.

వివరాలు 

 సీఎం,డిప్యూటీ సీఎంమధ్య మరింత పెరిగిన దూరం 

ఇదిలా ఉంటే, డీకే శివకుమార్ నమ్మకస్థుడు హెచ్‌సీ బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రిగా ఉన్న సమయంలో రాజన్న వాడిన భాష, ప్రవర్తనలే ఆయన పతనానికి కారణమని బాలకృష్ణ విమర్శించారు. ఆయన పదవి కోల్పోవడంలో ఎలాంటి కుట్ర లేదని,కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుందని తెలిపారు. ''ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీలో చేరేందుకు ఇప్పటికే దరఖాస్తు కూడా సమర్పించారు. అందుకే మా నాయకుడిని నిందిస్తున్నారు. అయినప్పటికీ మా నాయకుడు ఎలాంటి కుట్ర చేయలేదు. కాంగ్రెస్ అధికారం లేకుంటే ఇప్పుడే ఆయన పార్టీ మారిపోయేవారు'' అని బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో సీఎం సిద్ధరామయ్య,డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది.