LOADING...
S-400: అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థల కోసం రష్యా, భారత్  చర్చలు
అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థల కోసం రష్యా, భారత్ చర్చలు

S-400: అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థల కోసం రష్యా, భారత్  చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్‌లో ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్థాన్‌ సైన్యంలో భయంకర వణుకును సృష్టించింది. అయితే ఇప్పుడు దాయాదికి కంటిమీద కునుకులేకుండా చేసే మరో విషయం బయటకు వచ్చింది. భారత్‌ అదనపు ఎస్‌-400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో చర్చలు జరుపుతున్నట్లు రక్షణ నిపుణులు వెల్లడించారు. రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి షుగయేవ్‌ ఇటీవల వ్యాఖ్యానిస్తూ, భారత్ ఇప్పటికే ఎస్‌-400లను విజయవంతంగా ఉపయోగిస్తోంది, అలాగే కొత్త డెలివరీల కోసం చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలవ్రోవ్‌ మాస్కో నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదంటూ అమెరికా ఒత్తిడి చూపుతున్నప్పటికీ, భారత్‌ ఏమాత్రం తలొగ్గదని తాము భావిస్తున్నట్లు చెప్పారు.

వివరాలు 

టీ-90 ట్యాంక్‌లు, సుఖోయ్-30 ఎంకేఐ జెట్ల లైసెన్స్‌డ్ ఉత్పత్తి భారత్‌లో..

ఈ నేపథ్యంలో, రష్యా భారత్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం, 2020-24 మధ్యలో భారత్‌కు అత్యధికంగా 36 శాతం ఆయుధాలు రష్యా నుంచి మాత్రమే లభించాయి. ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, అమెరికా తదితర దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. రష్యా ఆయుధాలు భారతంలోనే స్థానికంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. టీ-90 ట్యాంక్‌లు, సుఖోయ్-30 ఎంకేఐ జెట్ల లైసెన్స్‌డ్ ఉత్పత్తి భారత్‌లో జరుగుతోంది. మాస్కో నుండి మిగ్-29 ఫైటర్ జెట్లు, కమోవ్‌ హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యా (అడ్మిరల్‌ గోర్ష్‌కోవ్‌)ను భారత్ అందుకుంది. అలాగే, ఏకే-203 రైఫిల్స్‌, బ్రహ్మోస్‌ క్షిపణులను కూడా భారత్‌లోనే తయారు చేస్తున్నారు.

వివరాలు 

ఎస్‌-400లో ఉపయోగించే నాలుగు రకాల క్షిపణులలో 40N6 రేంజ్ 400 కిలోమీటర్లు

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ చరిత్రాత్మక ఘట్టం సృష్టించింది. ఒక విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేయడం ద్వారా ఈ వ్యవస్థ ప్రపంచంలో తొలిసారిగా రికార్డు సృష్టించింది. సాధారణంగా,అంతరిక్ష లక్ష్యాలను లక్ష్యంగా చేసుకునే గగనతల రక్షణ వ్యవస్థలలో గరిష్టం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉండేది. ఎస్‌-400లో ఉపయోగించే నాలుగు రకాల క్షిపణులలో 40N6 రేంజ్ 400 కిలోమీటర్లు. ఆపరేషన్ సిందూర్‌లో వాయుసేన దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించింది. ఈ విధంగా, పాక్‌ తమ ఎఫ్-16 ఫైటర్ జెట్లు మరియు చైనా నుండి కొనుగోలు చేసిన విమానాలను భయపడి సురక్షిత దూరాలకు తరలించాల్సి వచ్చిందని అర్థం.