
Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ "మావోయిస్ట్ రహిత భారత్" లక్ష్యంతో ఆపరేషన్ కగార్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
ఈ క్రమంలో,గత 100 రోజుల్లో భద్రతా బలగాలు వివిధ ఎన్‌కౌంటర్‌లలో 120 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టాయి.
అదే సమయంలో,పెద్ద సంఖ్యలో మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో, మావోయిస్టులు కేంద్రం,పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే, తాము కాల్పుల విరమణకు సిద్ధమని మావోయిస్ట్ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది.
వివరాలు
వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం
"ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడంటే అప్పుడే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న హత్యాకాండను నిలిపేయాలి" అని పేర్కొన్నారు.
"శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం" అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో తెలిపారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.