Sanjay raut: ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ ఓటర్ల జాబితా తారుమారు చేస్తోంది.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎన్నికల సంఘం (ఈసీ) సాయంతో బీజేపీ ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేస్తున్నదని పేర్కొన్నారు. ఓటర్ లిస్టులను మార్చేందుకు, వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీకి ఓటేసిన వారి పేర్లు తొలగించి, వాటిని బోగస్ ఓటర్ల పేర్లతో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో తేడాలు ఉన్నాయని, ఈ విషయం ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని అన్నారు.
మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు
ఎన్నికల తర్వాత కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్రలు చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా చేయడమే తమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బీజేపీపై నమ్మకం లేకుండా పోయిందని, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించామన్నీ, రాబోయే ఎన్నికల్లోనూ వారిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.