
Singareni: కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి 'సువర్ణ' అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి 'సువర్ణ' అవకాశం దక్కింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ పరిధిలో బంగారం, రాగి గనులను అన్వేషించేందుకు లైసెన్స్ సాధించింది. ఈ అన్వేషణ లైసెన్స్‌ను మంగళవారం నిర్వహించిన వేలం ప్రక్రియలో ఎల్-1 స్థానంలో నిలిచి సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 13 కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్స్‌లను జారీ చేయడానికి వేలం విధానాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించింది. దాంతో సంస్థ ఈ నెల 13, 14, 19 తేదీల్లో నిర్వహించిన ఆన్‌లైన్ వేలాల్లో పోటీ పడింది.
వివరాలు
దేవదుర్గ్ బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్
వీటిలో మధ్యప్రదేశ్‌లోని పదార్ ప్రాంతంలో ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాలు,ఆంధ్రప్రదేశ్ చంద్రగిరి సమీపంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్ మరియు కర్ణాటకలో బంగారం,రాగి గనుల కోసం సింగరేణి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చివరికి దేవదుర్గ్ బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ను గెలుచుకుంది. ఈ అన్వేషణ ప్రక్రియలో భాగంగా సింగరేణి రానున్న ఐదేళ్లలో ఈ ప్రాంతంలోని బంగారం, రాగి నిక్షేపాల పరిమాణం,సామర్థ్యంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు
'హర్షం వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు'
సింగరేణి సీఎండీ బలరాం వివరించిన ప్రకారం.. అన్వేషణ పూర్తి అయిన తర్వాత ఈ గనుల తవ్వక హక్కుల కోసం కేంద్రం మరోసారి వేలం నిర్వహిస్తుంది. ఆ వేలంలో కూడా సింగరేణి పాల్గొంటుంది.ఆ తవ్వకాల హక్కులు సింగరేణికే వస్తే,సంస్థ నేరుగా తవ్వకాలు జరిపి బంగారం,రాగి నిక్షేపాలను వెలికితీస్తుంది. కానీ తవ్వకాల లైసెన్స్ ఇతర సంస్థలకు దక్కితే,వాటి ద్వారా పొందిన ఆదాయంలో రాయల్టీగా 37.75 శాతం సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది. అన్వేషణ పనుల కోసం సుమారు రూ.90కోట్ల వ్యయం చేయనుంది.ఇందులో రూ.20కోట్లను కేంద్రం రాయితీగా తిరిగి చెల్లించనుంది. తొలిసారిగా బంగారం,రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ను వేలం ద్వారా పొందిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.