
Supreme Court: రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన అంశంపై భారత సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో,ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేగాక, జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్ జరిగేటప్పుడు, ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని తెలిపారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు.
వివరాలు
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమి
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాజ్యాంగంలోని 170(3)వ అధికరణం ప్రకారం,ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది. 2026లో జరగబోయే జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సిందిగా చట్టంలోనే నిబంధన ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ తరహా పిటిషన్లకు అనుమతిస్తే, ఇతర రాష్ట్రాలనుండి కూడా డీలిమిటేషన్‌పై ఇలాంటి వ్యాజ్యాలు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.
వివరాలు
పురుషోత్తం రెడ్డి వేసిన పిటిషన్‌ను అధికారికంగా తిరస్కరించిన సుప్రీంకోర్టు
రాష్ట్రాల్లో డీలిమిటేషన్ నిబంధనలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే వేర్వేరుగా ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్న వాదనను కూడా ధర్మాసనం నమ్మలేదు. జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను పిటిషనర్ తప్పుగా విశ్లేషించారని పేర్కొంది. ఏకపక్షత చూపారని చేసిన ఆరోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ వ్యాఖ్యల మధ్యలో, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు అధికారికంగా తిరస్కరించింది.