Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం
జూన్ 2, తెలంగాణ ఆవిర్భవించిన రోజు. వందలాది మంది బలిదానాలు, ఎందరో యోధుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారం సగర్వంగా 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా యావత్తు తెలంగాణ దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసింది. స్వరాష్ట్రంలోనే తమ లక్ష్యాలు నెరవేరుతాయని విద్యార్థిలోకం పోరు గర్జన చేసింది. తెలంగాణలోని సబ్బండ వర్గాలు ప్రత్యేక రాష్ట్ర కాంక్షను దిల్లీకి వినిపించాయి. దశాబ్దాల ఈ పోరాటంలో ఎన్నో రాజకీయ పార్టీలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పడి, కాలగర్భంలో కలిసిపోయాయి. కేసీఆర్ నిరాహార దీక్ష, తదనంతర పరిణామాలతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 2014లో 29వ రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాం.
తెలంగాణ పోరాటానికి ముల్కీ ఉద్యమమే తొలి అడుగు
1948లో నిజాం నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వపరిపాలన సాగింది. తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగు 1952లో పడింది. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నాడు విద్యార్థులు, ఉద్యోగుల చేసిన 'ముల్కీ' పోరాటం హింసాత్మకంగా మారింది. ఆ పోరాటంలో చిందిన రక్తం భవిష్యత్ ఉద్యమానికి ఇంధనమైంది. 1955లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఒకే స్టేట్‌గా ఉంచాలని అప్పటి కేంద్రం నిర్ణయించింది. వాస్తవానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ (ఎస్ఆర్‌సీ) హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని సిఫారసు చేసినా, కేంద్రం పట్టించుకోకుండా 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణను విలీనం చేసింది. ఆ సమయంలో తెలంగాణకు అదనపు భద్రత కల్పిస్తూ 'పెద్దమనుషుల ఒప్పందం' చేసుకున్నారు.
1969లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, వందలాది మంది వీరమరణం
కొన్నేళ్ల తర్వాత ఆంధ్రాలోని కోస్తా ప్రాంతాల కంటే తెలంగాణ చాలా వెనుకబడి ఉందని, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి అవకాశాలు, నీటి పంపిణీలో కూడా అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రజలు పోరాటం చేయడం ప్రారంభించారు. తెలంగాణలోని విద్యార్థులు, ఉద్యోగులు 'జై తెలంగాణ' నినాదంతో ఉద్యమాన్ని చేపట్టారు. 1969లో పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధంగా ఉద్యోగులను నియమించడానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో పోరాటం రాజుకుంది. అది దావానంలా తెలంగాణ అంతటా వ్యాపించింది. ఆ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు చేరడంతో పోరాటం కేంద్రం హైదరాబాద్‌కు మారింది. 1969 జనవరి 20తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. అప్పటి ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వందల మంది అమరులయ్యారు. ఇదే తెలంగాణ ఉద్యమంగా చరిత్రక్కెక్కింది.
తెలంగాణ ఉద్యమాన్ని 6సూత్రాల ఫార్ములా కూడా ఆపలేదు
1969 ఆందోళన తర్వాత, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వెనుకబడిన ప్రాంతాల వేగవంతమైన అభివృద్ధికి, ఉపాధి కోసం స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చే 6సూత్రాల ఫార్ములాను తీసుకొచ్చారు. అది కూడా పెద్ద మనుషుల ఒప్పందం మాదిరాగానే అమలుకు నోచుకోలేదని తెలంగాణ వాదులు మళ్లీ ఉద్యమించడం ప్రారంభించారు. 1997లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించిన బీజేపీ తెలంగాణకు మద్దతు ఇచ్చింది. చిన్న రాష్ట్రాలకు అనుకూలం అంటూ తీర్మానం కూడా చేసింది.
కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ఏర్పాటు, తెలంగాణ ఉద్యమానికి మరో మలుపు
2001లో కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాజకీయ పంథావైపు మారింది. 'భావజాల వ్యాప్తి, తెలంగాణ సాహిత్యం, పార్లమెంటరీ పంథా' అనే వ్యూహంతో ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను కేసీఆర్ రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో మంచి ఆదరణ లభించింది. 2004 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కట్టి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో తెలంగాణకి ఇస్తామన్న హామీ మేరకు కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని కేసీఆర్ మళ్లీ ఉద్యబాట పట్టారు.
కేసీఆర్ నిరాహార దీక్ష
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2009లో నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం అని చెప్పాలి. కేసీఆర్ నిరాహార దీక్ష చేయడంతో ఉద్యమానికి భారీ ఊపు వచ్చింది. కేసీఆర్ పోరాటానికి దిగొచ్చిన అప్పటి యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. అయితే ఆ సమయంలో సీమాంధ్రలో నిరసనలు జరగడంతో ఆ ప్రకటనను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో మనస్థాపంతో ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2010లో తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆంద్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలను సమనంగా అభివృద్ధి చేయాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
జూన్ 2, 2014న నెరవేరిన తెలంగాణ ప్రజల కల
2011, సెప్టెంబర్ 13న ప్రారంభమైన సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని చివరి మెట్టుకు తీసుకుళ్లిందని చెప్పాలి. సకల జనుల సమ్మె యావత్తు తెలంగాణను ఉద్యమంలోకి రప్పించగలిగింది. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు, తెలంగాణ సమాజంలోని ఒత్తిడి మేరకు దిగొచ్చిన అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును 2014లో ఆమోదించారు. విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేయాలని సూచించారు. జూన్ 2, 2014న హైదరాబాద్ రాజధానిగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినట్లు గెజిట్ విడుదలైంది.